దీర్ఘకాలిక సమస్యలన్నింటి నుంచి విముక్తి కలిగించి రాష్ట్రాన్ని నవ తెలంగాణగా మార్చేందుకే చట్టాల రూపకల్పనతోపాటు సంస్కరణలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పాలన సజావుగా సాగడంతోపాటు ప్రజలకు అన్ని అంశాల్లో సౌలభ్యం, సౌకర్యం కల్పించడమే వీటి ఉద్దేశమని... సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో స్పష్టం చేశారు. కొత్తగా తెస్తున్న రెవెన్యూ, ఇతర బిల్లుల... నిర్ణయాలు, ఉద్దేశాలు మంత్రులకు వివరించారు. ‘‘కొత్త పంచాయతీరాజ్, పురపాలక చట్టాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు రెవెన్యూ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది. ప్రజల కోణంలోనే దీనిని రూపొందించాం. అన్ని అంశాలపై స్పష్టతనిచ్చాం. పాలనపరంగానూ ఎంతో సులభతరమైంది. నూటికి నూరు శాతం విజయవంతమవుతుంది. మంత్రులు దీనిని సమగ్రంగా అధ్యయనం చేయాలి’’ అని సూచించారు.
అన్ని వర్గాలకు న్యాయం
‘రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్ల పెంపుదలకు తీర్మానం చేసి కేంద్రానికి పంపినా స్పందన లేదు. ఎస్సీలు, బీసీలకు సంపూర్ణ న్యాయం చేస్తాం. అతి నిరుపేద, సంచార జాతుల్లోని 17 కులాలను బీసీల జాబితాలో చేర్చేందుకు నిర్ణయం తీసుకొని వారికి భరోసా కల్పిస్తున్నాం. కొత్త సచివాలయ నిర్మాణ పనులను సత్వరమే చేపడతాం. అన్ని అడ్డంకులు తొలిగాయి. అన్ని జిల్లాలకు సమీకృత కార్యాలయాల సముదాయాలను నిర్మిస్తామని కేసీఆర్ వివరించారు.
ఎన్నికలకు సన్నద్ధం కావాలి
దుబ్బాక ఉప ఎన్నికతోపాటు జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం మహా నగర పాలక సంస్థల ఎన్నికలకు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికలకు సన్నద్ధం కావాలి. ఈ స్థానాల్లో గెలిపించే బాధ్యతను మంత్రులు తీసుకోవాలని సీఎం సూచించారు. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై కేసీఆర్‌కు మంత్రులు అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: 28 వరకు శాసనసభ వర్షాకాల సమావేశాలు..ఈనెల 9న రెవెన్యూ బిల్లు