CM Jagan Review: ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు. అమరావతి, మూడు రాజధానుల కేసులో హైకోర్టు తీర్పు కాపీలోని అంశాలపై చర్చించారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా రాజధానిపై చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై సీఎం చర్చించారు. హైకోర్టు తీర్పులో చెప్పినట్లుగా నిర్ణీత కాలవ్యవధిలో అభివృద్ది, ప్లాట్ల కేటాయింపుల సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చే విషయంపైనా సీఎం జగన్ చర్చించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై సమాలోచనలు చేశారు. సుప్రీంకోర్టుకు వెళితే.. ఎలా ఉంటుంది. వెళ్లకపోతే ఏం చేయాలనే అంశాలపైనా నేతలు, న్యాయ నిపుణుల అభిప్రాయాలను సీఎం జగన్ తీసుకున్నారు. రాజధానిపై ఎలా ముందడుగు వేయాలనే అంశమై సమగ్రంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజధానిపై ప్రభుత్వ విధానాన్ని, భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు స్పష్టం చేయాలని మంత్రిని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిసింది.
హైకోర్టు తీర్పులో ఏముందంటే..
అమరావతిపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 3 నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించింది. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని.. అలాంటప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు చేయడం కుదరదన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాలని సూచించిందని న్యాయవాదులు తెలిపారు. అమరావతి కోసం సేకరించిన భూములను రాజధాని అవసరాలకే వినియోగించాలని ఆదేశించింది. పూలింగ్ భూములను ఇతర అవసరాలకు తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రిట్ ఆఫ్ మాండమస్ నిరంతరం కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద 50 వేల రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. అంతేకాకుండా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కార్యాలయాల తరలింపుపైనా మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు ఆదేశించింది.
ఇదీచూడండి: ప్రజారాజధానిని అమరావతి ప్రజలు కాపాడుకున్నారు: చంద్రబాబు