కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్, పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌లకు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ మరోసారి ఫిర్యాదు చేశారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. 796 అడుగుల నుంచి కృష్ణా నీటిని తెలంగాణ అక్రమంగా తోడుతోందనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని జగన్ అన్నారు.
'కేంద్ర జలశక్తి, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదులు చేసినా చర్యలు లేవు. ఏపీ పట్ల కేఆర్ఎంబీ వివక్ష చూపుతోంది. తెలంగాణ ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తోంది. ఏపీ ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవట్లేదు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోవట్లేదు. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు ఉత్సాహం చూపిస్తోంది. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులు తొలుత సందర్శించాలి. ఆ తర్వాతే రాయలసీమ లిఫ్ట్ సందర్శించాలి. తెలంగాణ ప్రాజెక్టులను ముందు పరిశీలించేలా కేఆర్ఎంబీని ఆదేశించాలి' అని కేంద్రమంత్రి షెకావత్‌కు రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు.
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు పూర్తిచేస్తే శ్రీశైలంలో చుక్కనీరు మిగలదని లేఖలో సీఎం జగన్ ప్రస్తావించారు. తెలంగాణ నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. మరో అవకాశం లేకే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని తెలిపారు. సీమ ఎత్తిపోతలతో రోజుకు 3 టీఎంసీలు తరలింపు సాధ్యం అవుతుందన్నారు. ఏపీకి సాగునీరు అవసరం లేనప్పుడు తెలంగాణ విద్యుదుత్పత్తి చేయవద్దని లేఖలో పేర్కొన్నారు. వివక్ష చూపవద్దని కేఆర్‌ఎంబీని ఆదేశించాలని కేంద్రమంత్రి షెకావత్‌కు తెలిపారు. కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలన్నారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలు మోహరించాలని లేఖలో పేర్కొన్నారు.
రాయలసీమ ఎత్తిపోతలకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ను జగన్ కోరారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను జూన్ 30న సీడబ్ల్యూసీకి అప్‌లోడ్ చేశామని తెలిపారు. సీమ ఎత్తిపోతలకు భూసేకరణ చేయడం లేదని... అటవీ ప్రాంతం, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల అడ్డంకులు లేవని పేర్కొన్నారు. ఎత్తిపోతలను పర్యావరణ జోన్‌కు 10 కి.మీ. వెలుపల నిర్మిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Highcourt: పరీక్షలు ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేం: హైకోర్టు