ఒకవైపు కరోనా భయం వెంటాడుతోంది. ఇంకోవైపు విద్యాసంస్థల గంట మోగనుంది. తల్లిదండ్రుల్లో ఏదో తెలియని సందిగ్ధం. పిల్లలను పంపాలా? వద్దా? అనే మీమాంస కొనసాగుతుండగానే సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలు మొదలుకొని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను, కళాశాలలను ప్రారంభించనున్నారు. పిల్లలను పంపిస్తారా..లేదా? అని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే తల్లిదండ్రుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. కరోనా కారణంగా పిల్లలు ఏడాదిన్నర కాలంగా ఇళ్లకే పరిమితం కావడంతో రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్ తరగతులతో మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు సబ్జెక్టుల పరంగా ప్రాథమికాంశాలు మరిచిపోయిన పరిస్థితి. కొందరు కనీసం రాయలేని, చదవలేని స్థితికి చేరుకున్నారు. బడికి దూరమై.. సెల్‌ఫోన్లు, టీవీలే ప్రపంచంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి నుంచి కాపాడుకుంటూ బడిబాట పట్టేదెలా..? తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉండాలి..? ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి..? బోధన ఏ విధంగా ప్రారంభించాలి..? మహమ్మారి బారిన పడకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలేమిటి..? తదితర అంశాలపై నిపుణుల సూచనలు..
పౌష్టికాహారంతో ఇన్‌ఫెక్షన్లు దూరం
* వ్యాధినిరోధక శక్తి పెంచే పౌష్టికాహారం పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లో చేసిన ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. పిల్లల డైట్‌లో రోజూ ఏదో ఒక పండు ఉండేలా చూడాలి. చిరుధాన్యాలతో చేసిన ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించాలి.
*నిమ్మరసం, మజ్జిగ, పాలు లాంటి ద్రవ పదార్థాలతో ఇన్‌ఫెక్షన్లు నివారించవచ్చు.
* రోజూ 2గ్లాసుల పాలు, గుడ్డు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఆహారంలో ఉండేలా చూడాలి. వారానికి రెండు, మూడుసార్లు మాంసాహారం పెట్టాలి.
* చిరుధాన్యాల్లో ఐరన్, కాల్షియం, మాంసకృత్తులు, పీచు అధికంగా ఉంటాయి.
* అన్నం బదులు కొర్రల కిచిడీ పిల్లల ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుంది.
-సుజాత స్టీఫెన్, పోషకాహార నిపుణులు
సాధారణ టీకాలు తప్పక వేయించాలి
-డాక్టర్ అంజుల్ దయాళ్, చిన్న పిల్లల వైద్య నిపుణులు, కాంటినెంటల్ ఆస్పత్రి
* కరోనా వేళ తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపే ముందు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పదేళ్ల పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి.
* పదేళ్లలోపు పిల్లలకు ఇతర అన్ని రకాల సాధారణ టీకాలు పూర్తి చేయాలి. ఎంఏఆర్, చికెన్‌పాక్స్ టీకాలు అందించాలి.
* దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు ఉంటే తగ్గే వరకు పాఠశాలలకు పంపకూడదు.
* తరగతుల్లో పిల్లల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి.
* ప్రతి విద్యార్థికి మాస్క్ తప్పనిసరి. కొందరు పిల్లలు మాస్క్‌లను కిందకు లాగుతుంటారు. అలా చేయకూడదని తల్లిదండ్రులు చెప్పి పంపాలి.
* పిల్లలందరూ గుమిగూడేలా స్కూల్ అసెంబ్లీలు, ఎక్కువ మంది కలిసి ఆడే క్రీడలు నిర్వహించకపోవడమే మేలు.
* మాస్క్‌తో ఉన్న చిన్న పిల్లలను ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలి. ఏదైనా ఇబ్బంది ఏర్పడితే తక్షణమే స్పందించాలి.
* ఇంటి నుంచే ఆహారం పంపాలి. కాచి వడబోసిన పరిశుభ్రమైన తాగునీటిని అందించాలి.
* తరగతులు ప్రారంభమయ్యే ముందు గదులను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి.
* డెంగీ దోమలు పగటిపూట కుడతాయి. పిల్లలను విద్యాసంస్థలకు పంపే ముందు కాళ్లు చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేయాలి.
* పాఠశాలల చుట్టూ నీళ్లు నిల్వ లేకుండా చూడాలి. ఫాగింగ్ చేపట్టాలి. తరగతి గదుల్లో తగినన్ని ఫ్యాన్లు ఉండాలి.
రవాణా సౌకర్యం పకడ్బందీగా ఉండాలి
* పిల్లలను ఆటోలు, బస్సుల్లో పంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే తల్లిదండ్రులే స్కూల్ వద్ద దింపిరావడం ఉత్తమం.
* ఆటోలో పంపేటప్పుడు ముగ్గురి కంటే ఎక్కువ మంది పిల్లలను ఎక్కించకుండా చూడాలి. డ్రైవర్, పిల్లలు కూర్చొనే సీటు మధ్య ప్లాస్టిక్ కవర్ ఉండాలి
* డ్రైవర్ టీకా తీసుకొని ఉండాలి. నిత్యం ఆటోను శానిటైజ్ చేయాలి.
* బస్సులో పంపేటప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను దూరం దూరంగా కూర్చోబెట్టాలి. బస్సును రోజూ శానిటైజ్ చేయాలి.
* బస్సు డ్రైవర్, అటెండర్ కరోనా టీకాలు తీసుకొని ఉండాలి.
* ప్రతి పాఠశాల, కళాశాల బస్సు ఫిట్‌నెస్‌తో ఉండేలా చూసుకోవాలి.
-పాండురంగనాయక్, జేటీసీ, హైదరాబాద్
సామర్థ్యాలు పరీక్షించి.. మెలకువతో బోధించాలి
* పాఠశాలలు ప్రారంభించిన వెంటనే సిలబస్‌లోని పాఠ్యాంశాల బోధన జోలికి వెళ్లకూడదు. ముందుగా పిల్లల శక్తి సామర్థ్యాలు పరీక్షించాలి. తొలి వారం, పది రోజులు ఈ కార్యక్రమానికి కేటాయించాలి.
* పరీక్ష పెడుతున్నామని తెలియకుండా.. వివిధ యాక్టివిటీస్ చేయిస్తూ పిల్లల అకడమిక్ సామర్థ్యాల స్థాయిని ఉపాధ్యాయులు గమనించాలి.
* ఆ తర్వాత దానికి తగ్గట్టుగా 15 రోజులపాటు బ్రిడ్జికోర్సు తరహాలో పాఠాలు బోధించాలి. పాఠ్యపుస్తకాలతో సంబంధం లేకుండా అక్షరాలు, గుణింతాలు, గణితంలో ప్రాథమికాంశాలను బోధించాలి.
* పజిల్స్, అంత్యాక్షరి వంటి కార్యక్రమాలు నిర్వహించాలి.
* బడికి వెళ్లిన మరుసటి రోజు నుంచే చదవడం లేదని,రాయడం లేదని తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదు.
* పిల్లలపై కోపగించుకోకుండా నెమ్మదిగా నేర్చుకునేందుకు అవకాశం ఇవ్వాలి.
* ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకుని ప్రోత్సహించాలి.
* విద్యార్థులు నిత్యం ప్రతి సబ్జెక్టు మీద మొదట 15 నిమిషాలు వంతున కేటాయించి చదవాలి. పాఠశాలలో చెప్పిన విషయాలు ఏరోజుకారోజే నేర్చుకోవాలి.
-ఆశాలత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
ముందుగా పునశ్చరణ.. తర్వాతే బోధన
* విద్యార్థులు భావవ్యక్తీకరణ నైపుణ్యాలకు దూరమయ్యారు. బడికి వచ్చాక గంటపాటు ఉపాధ్యాయుల సమక్షంలోనే తోటి విద్యార్థులతో మాట్లాడుకునే స్వేచ్ఛ కల్పించాలి.
* సామాజికంగా, మానసికంగా వారిలో విశ్వాసం ప్రోది చేయాలి. గత తరగతిలో చదువుకున్న అంశాలను మళ్లీ పునశ్చరణ చేసి.. తర్వాత ప్రస్తుత తరగతిలోని సబ్జెక్టులను బోధించాలి.
* పిల్లలకు తరగతి గదిలోనే వివిధ యాక్టివిటీస్ చేయించాలి. మూడు నెలలపాటు యాక్టివిటీ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.
-డాక్టర్ వాసిరెడ్డి అమర్‌నాథ్, విద్యావేత్త
ఆందోళనను అధిగమిద్దాం.. కరోనా భయాన్ని జయిద్దాం
* భయాన్ని, ఆందోళనను, ఆతృతను అధిగమించి ముందుకెళ్లాల్సిన తరుణమిది. పాజిటివ్ అంశాలవైపు ఆలోచన ఉండాలి. పరిస్థితిని తక్కువగా అంచనా వేయరాదు.
* పిల్లలను భౌతికంగా, మానసికంగా సిద్ధం చేయాలి. గతంలో లంచ్‌బాక్సు తరహాలో ‘కరోనా కేర్ బాక్సు’ను సిద్ధం చేయాలి. ఈ బాక్సులో రెండు, మూడు మాస్కులు ఉండాలి. శానిటైజర్ బాటిల్ ఉంచాలి. భౌతికదూరం పాటించేలా చేతికి లేబుల్ అతికించాలి. దానివల్ల పిల్లలు భౌతికదూరం పాటించాలని గుర్తుంచుకుంటారు.
-గీత చల్లా, మనస్తత్వ విశ్లేషకులు