మానసిక స్థితి సరిగ్గాలేక ఆస్పత్రిలో చేరి వ్యాధి నయమైన తర్వాత కూడా ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ తన వారి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ యోచన చేసింది. వారి కోసం హాఫ్ వే హోమ్స్ నిర్మించాలని నిర్ణయించి, 15 రోజుల్లోగా నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ ఎస్కే జోషి అధికారులను ఆదేశించారు.
సైకియాట్రిస్ట్ సేవలు తీసుకోండి
ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించి రిహాబిలిటేషన్ నిర్మాణానికి సంబంధించిన నమూనా సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. అందుకు అవసరమైన నిధుల వివరాలు సమర్పించాలని తెలిపారు. జీవన విధానం, ఒత్తిడి తదితర అంశాలన్నింటిపై మానసిక వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అవసరమైతే సైకియాట్రిస్టుల సేవలు వినియోగించుకోవాలన్నారు.
నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదన
జిల్లాలో మెంటల్ హెల్త్ బోర్టుల ఏర్పాటుకు అనుమతి కోసం హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాయాలని అధికారులకు సీఎస్ ఆదేశం జారీ చేశారు. దీన్ దయాల్ డిజెబుల్డ్ రిహాబిలిటేషన్ పథకం నుంచి నిధుల కోసం ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు.
కర్ణాటక, తమిళనాడు తరహాలో
వైద్య, పారామెడికల్ సిబ్బంది శిక్షణకు కర్ణాటక, తమిళనాడు తరహాలో కార్యచరణ రూపొందిస్తామని అధికారి శాంతికుమారి తెలిపారు. మెంటల్ హెల్త్ స్క్రీనింగ్‌కు నిర్దేశిత విధానాలు రూపొందించి వైద్య సేవలు అందిస్తామన్నారు. సైక్రియాటిస్ట్ అసోసియేషన్ల సేవలు వినియోగించుకుంటామని వెల్లడించారు.
- ఇదీ చూడండి : వరద ముంచెత్తింది... ఊరు వలస వెళ్లింది!