రాష్ట్రంలో ఇప్పటివరకు అమలవుతున్న గిరిజన రిజర్వేషన్లను పెంచారు. యాదాద్రి పర్యటన నుంచి వచ్చాక మంత్రులు, అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్టీ రిజర్వేషన్లపై సుదీర్ఘంగా చర్చించారు. జనాభా శాతానికి అనుగుణంగా గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని ఆరు నుంచి పదికి పెంచాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు. అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు వెలువరించారు.
రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ తమిళనాడు తరహాలో.. 2016 ఏప్రిల్‌లో బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయన్న ప్రభుత్వం అప్పట్నుంచి పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. ఎస్టీలు ఇంకా నష్టపోకుండా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. విద్య, ఉద్యోగావకాశాల్లో 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకివస్తాయని పేర్కొంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా 2022 సెప్టెంబర్ 30వ తేదీతో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జీవోతో రాష్ట్రంలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి.
రిజర్వేషన్ల పెంపుకోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రత్యేక బిల్లు తీసుకొచ్చింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు గిరిజనులతో పాటు.... ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం ప్రత్యేకబిల్లు తెచ్చింది. ముస్లింమైనార్టీలకు 12శాతం.... గిరిజనులకు10శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించారు. బీసీ-ఈ కేటగిరీ కింద ముస్లిం మైనార్టీలకు ఉన్న 4శాతాన్ని 12కి, గిరిజనులకు అమలు అవుతున్న 6శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారు.
మొత్తం రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని... 50 నుంచి 62కు పెంచుతూ 2017 ఏప్రిల్ 16న బిల్లు శాసనసభ, మండలిలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. రిజర్వేషన్లు 50 శాతం దాటుతుండడంతో తమిళనాడు తరహాలో బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రధానిమోదీతోనూ రిజర్వేషన్ల పెంపు విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి ఆటంకాలు లేవని రాజ్యాంగపరంగా ఇబ్బందిఉండబోదని వివరించారు. గడచిన ఐదేళ్లుగా ఆ బిల్లు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉంది. రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కేంద్రంనిర్ణయం ఆలస్యం చేయడంతో...బిల్లుతో సంబంధం లేకుండా కోటా పెంపుపై గతంలో రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేసింది. ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేసిన.......... చెల్లప్ప కమిషన్ నివేదిక ఆధారంగా గిరిజనుల రిజర్వేషన్ల పెంపు విషయమై ఆలోచన చేసింది.
కేంద్రం వద్ద ఉన్న బిల్లుతో సంబంధం లేకుండా ఎస్టీ రిజర్వేషన్లు పదిశాతానికి పెంచాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్... వారంలోగా ఉత్తర్వులు జారీ చేస్తామని ఇటీవల ఆదివాసీ, బంజారా ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుతో గిరిజనులకు రిజర్వేషన్లు ఆరు నుంచి పది శాతానికి పెరిగాయి. ఎస్సీలకు 15 శాతం, బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి పదిశాతం రిజర్వేషన్లు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల శాతం 64కు చేరింది.
ఇవీ చదవండి: