2016, 17, 18 లో జరిగిన ఘటనలను బూచిగా చూపించి కోడెలపై 2 నెలల వ్యవధిలో 19 కేసులు బనాయించారంటే ఆయనపై ఎంత కక్ష కట్టారో అర్థమవుతుందన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ప్రభుత్వ చర్యలతో మనోవేదనకు గురయ్యేలా చేసి చివరికి ఉరి వేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మనిషిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, అన్ని రకాలుగా వేధించి దిక్కుతోచని స్థితికి తీసుకొచ్చారని.... చివరకు అది ఆత్మహత్యకు దారి తీసిందని చంద్రబాబు అన్నారు. పాత ఫర్నీచర్ విషయంలో ఆగమేఘాల మీద కేసులు పెట్టారన్నారు.
43 వేల కోట్ల రూపాయల అవినీతి కేసులో జగన్‌పై 11 ఛార్జిషీట్లు నమోదయ్యాయని... అలాంటి వ్యక్తి.... ఎన్నో అభివృద్ధి పనులు చేసిన కోడెలపై కేసులు పెట్టడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వ పాలనతో, తీసుకుంటున్న నిర్ణయాలతో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారని.... వీటన్నింటిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని.... కోడెలపై వేధింపుల కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: తెదేపా నేత కోడెల శివప్రసాదరావు బలవన్మరణం