Chandrababu fires on YCP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లక్షా 75 వేల కోట్ల అవినితీకి పాల్పడ్డారని.. తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మదనపల్లెలో "ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా’ పేరుతో మినీ మహానాడు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. "మూడేళ్లుగా అరాచక పాలనపై పోరాటం చేస్తున్నాం. ఎక్కడ చూసినా సమస్యలే.. లేని సమస్యలు సృష్టించారు. ప్రశ్నించిన వారిని బెదిరించి కేసులు పెడుతున్నారు. మేం కన్నెర్ర చేస్తే వైకాపా నాయకులు బయటకు రాలేరు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఏమీ సాధించలేరు. మేం తలచుకుంటే జగన్ పాదయాత్ర చేసే వారా? ఆ రోజు ఊరూరా తిరిగి ముద్దులు పెట్టి.. ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నారు. పేద పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకున్న పార్టీ తెదేపా. మా హయాంలో ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు కట్టించాం. అమ్మ ఒడికి ఆంక్షలు పెట్టి తల్లులను మోసం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ. అమ్మఒడి బూటకం, ఇంగ్లిష్ మీడియం ఒక నాటకం, నాడు- నేడు అవినీతి మయం" అని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు.
ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు రావాలి: "వైకాపా ప్రభుత్వం వచ్చాక అన్నింటిపై బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై తీవ్ర భారం మోపారు. మళ్లీ గ్యాస్ సిలిండర్ ధర పెంచారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి. కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెస్తున్నారు. ల్యాబ్ పరీక్షలో మద్యంలో రసాయనాలు ఉన్నాయని తేలింది. జగన్ .. సొంత డిస్టిలరీలు పెట్టుకుని రేట్లు పెంచారు. నాసిరకం మద్యం తెచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆటలా? మూడేళ్లలో ఐదుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. కొత్తగా రూ.5వేల కోట్ల వృత్తి పన్ను వేస్తున్నారు. ఈ ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు ముందుకు రావాలి. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఏమైంది? నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు" అని చంద్రబాబు ఆరోపించారు. మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో మదనపల్లె జనసంద్రంగా మారింది.
ఇవీ చదవండి: