ఏపీలోని విశాఖలో గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు దక్షిణ కొరియా సంస్థ ఆసక్తిగా ఉందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయి ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంటు భూముల్లో ప్లాంట్ ఏర్పాటుకు పోస్కో స్టీల్ ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు. దీనికోసం పోస్కో-ఆర్‌ఐఎన్‌ఎల్ మధ్య 2019లో అవగాహన ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశారు.
ఇది న్యాయపరంగా కట్టుబాట్లు లేని అవగాహనా ఒప్పందమని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. వాటాల విషయమై నిర్ధరణ కాలేదని పేర్కొన్నారు. కొత్త ప్లాంట్‌లో 50 శాతం వాటా ఉండాలని పోస్కో సంస్థ కోరినట్లు చెప్పారు. భూముల విలువ ఆధారంగా ఆర్‌ఐఎన్‌ఎల్ వాటా నిర్ధరణ ఉంటుందని వివరించారు. మరోవైపు 2018లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పోస్కో, హ్యుందయ్ బృందం సందర్శించినట్లు మంత్రి తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 2019 జులై, సెప్టెంబర్, 2020లో పోస్కో అధికారుల బృందం ఆర్‌ఐఎన్‌ఎల్‌ను సందర్శించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.