ఏపీ కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ట్రస్టు ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల ఈనెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్ ఛైర్మన్‌ను కలిశారు. అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఉద్యోగుల వేతనాలు ఎందుకు నిలిపివేశారంటూ ఈవోను ఆయన నిలదీశారు. ఈ క్రమంలో ఈవో, ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి.. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరేపించారనే ఆరోపణలతో అశోక్ గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఛైర్మన్, కరస్పాండెంట్ సహా 10మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
మాన్సాస్ ట్రస్టు(Mansas Trust) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు.. గతంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాన్సాస్ ట్రస్టు(Mansas Trust) కార్యకలాపాలపై పదేళ్లుగా ఆడిటింగ్ జరగలేదన్న ఆరోపణల దృష్ట్యా.. ఆడిట్ కోసం చెల్లించిన ఫీజు వివరాలను ఈ నెల 21వ తేదీలోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలోని మాన్సాస్ ట్రస్టు భూముల్లో(Mansas Trust Lands) ఇసుక తవ్వకాల అనుమతులపై నివేదిక ఇవ్వాలని అశోక్ గజపతిరాజు అన్నారు. విద్యాసంస్థల బడ్జెట్ ప్రతిపాదనలను వారంలో తయారు చేయాలని, సిబ్బంది జీతాలకు చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
ఇదీ చదవండి: