- హైదరాబాద్ పాతబస్తీ జియాగూడకు చెందిన రాకేష్ స్థానికంగా ఓ ప్రభుత్వ గుర్తింపులేని ప్రైవేటు పాఠశాలలో 1989-1997 మధ్య ఒకటి నుంచి ఏడు వరకు చదివారు. ఏడోతరగతి బోర్డు పరీక్షల్ని అక్కడే ఉన్న మరో పాఠశాల ద్వారా ప్రైవేటు విద్యార్థిగా పరీక్షలు ఆ స్కూల్ రాయించింది. ప్రస్తుతం ఆ రెండు పాఠశాలలు మూతబడ్డాయి. చదివిన పాఠశాల నుంచి అప్పట్లో బోనఫైడ్ తీసుకోలేదు. ప్రస్తుతం యాజమాన్యం అందుబాటులో లేదు. దీంతో స్థానికతపై విద్యార్హత పరంగా ఆధారాలు లేకపోవడంతో టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు.
- సంగారెడ్డికి చెందిన ఓ విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 1-7 వరకు గుర్తింపులేని పాఠశాలలో చదివారు. అప్పటి యాజమాన్యం రికార్డులు నిర్వహించలేదు. ఇప్పుడు వెళ్లి భోనఫైడ్ ఇవ్వాలని అడిగితే అక్కడే చదివినట్లు ఆధారాలు, ప్రోగ్రెస్ కార్డులు, ఫీజు రశీదు వంటివి తీసుకురావాలని సూచిస్తున్నారు. చాలా మంది దగ్గర అవి లేక ఇబ్బంది పడుతున్నారు.
TSPSP OTR Registration : రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలల్లో చదువుకున్న ఉద్యోగార్థులకు ధ్రువీకరణ పత్రాల కష్టాలు ఎదురవుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)కు ఆందోళన చెందుతున్నారు. గుర్తింపులేని పాఠశాలలు సరైన రికార్డులు నిర్వహించకపోవడం, అప్పట్లో చదువుకున్న పాఠశాలలు ప్రస్తుతం మూతబడటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రైవేటుగా ఏడు, పదోతరగతి పరీక్షల్ని స్థానిక జిల్లాల్లోనే రాసినట్లు మెమోలు ఉన్నప్పటికీ, 1-7 వరకు ప్రైవేటు పాఠశాలలో చదివినట్లుగా బోనఫైడ్ సర్టిఫికెట్లు లేకపోవడం సమస్యగా మారింది. పోటీపరీక్షల్లో ప్రతిభ చూపించినా, బోనఫైడ్ లేదన్న కారణంగా ఉద్యోగాలకు దూరమవుతామన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రెండేళ్లకు మించి ఇవ్వని నివాస ధ్రువీకరణ..: విద్యాసంస్థల్లో చదవని విద్యార్థులు అప్పట్లో అక్కడ నివాసం ఉన్నట్లు నివాస ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంది. అయితే తహసీల్దార్ కార్యాలయాల్లో రెండేళ్లకు మించి ఇవ్వడం లేదు. 15 ఏళ్ల క్రితం అక్కడే ఉన్నట్లు నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. అలాగే అప్పట్లో కొందరు చదువుకున్న పాఠశాలలపేర్లు మారాయి. కొత్త యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లాయి. గతంలో చదువుకున్నట్లు ధ్రువీకరణపత్రాలు ఇవ్వాలని కోరితే కొన్నిచోట్ల డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగాల రీత్యా తరచూ రెండేళ్లకోసారి బదిలీలకు గురైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల పిల్లలు ప్రస్తుతం ఏ జిల్లా స్థానికులు అవుతారన్న విషయమై స్పష్టత కొరవడింది.
ప్రభుత్వం చొరవ తీసుకోవాలి..
'స్థానికత నిర్ధారణకు 4 నుంచి 10వ తరగతి కాకుండా 1-7వ తరగతి ప్రామాణికతతో సమస్యలు వస్తాయని ముందే అంచనా వేశా. ప్రస్తుతం అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యకు ప్రభుత్వమే పరిష్కారం చూపించాలి. గుర్తింపులేని పాఠశాలల్లో చదివిన విద్యార్థుల వద్ద ఆధారాలు క్షుణ్నంగా పరిశీలించి, ఆ సమయంలో అక్కడున్నట్లు తహసీల్దార్‌లు నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలి. ఈ విషయంలో పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయి పరిశీలన చేయించాలి.' - విఠల్, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యులు
ఇదీ చదవండి : గ్రూపు- 1 అభ్యర్థులకు వారి నుంచి గట్టి పోటీ.. కారణాలివే.!