భాగ్యనగరానికి చెందిన వైద్యుడు విజయవాడ వెళ్లి తిరిగి విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు రాజీవ్‌నగర్ వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. 20నిమిషాల వెయిటింగ్ తర్వాత రైడ్ రద్దు చేసుకున్నట్లు వచ్చింది. ఆ తర్వాత ఓలా క్యాబ్ బుక్ చేసుకోగా అది కూడా 20 నిమిషాల తర్వాత రద్దయినట్లు(cab ride cancellation) వచ్చింది.
ఈలోగా క్యాబ్‌డ్రైవర్లు సదరు వైద్యుడ్ని చుట్టుముట్టి బేరసారాలకు దిగారు. యాప్‌లో రైడ్ బుక్ చేసుకున్నా డ్రైవర్లు రారని తేల్చిచెప్పారు. నేరుగా మాట్లాడుకుని తాము నిర్దేశించిన ఛార్జీ చెల్లిస్తేనే తీసుకెళతామని హుకుం జారీ చేశారు. చివరికి ఓ క్యాబ్‌లో రూ.900 చెల్లించి సదరు వైద్యుడు ఇంటికి చేరుకున్నారు. ఆయనొక్కడే కాదు.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరానికి చేరుకునేందుకు ఎందరో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రైడ్‌లు రద్దు అవుతున్నా, వాటిని సమీక్షించే విషయాన్ని సదరు కంపెనీలు పట్టించుకోవడం లేదు.
భారం పెరిగిందని..
విమానాశ్రయం నుంచి నిత్యం 10వేల క్యాబ్‌లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటికి గంటకు రూ.250 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత గంటకు రూ.50చొప్పున తీసుకుంటున్నారు. 24 గంటలకు రూ.600(Cab ride fair) వరకు ఉంది. దీనికితోడు కంపెనీల పరంగా బుకింగ్ జరిగితే డ్రైవర్ల రైడ్ ఛార్జీల్లో 25% కమీషన్ వసూలు చేస్తున్నాయి.
ప్రస్తుతం పెట్రోల్ రేట్లు పెరిగి డ్రైవర్లపై ఆర్థికంగా భారం పడుతోంది. దీంతో యాప్‌తో రైడ్ బుక్ చేస్తే చాలా మంది డ్రైవర్లు తిరస్కరిస్తున్నారని తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల సంఘం నాయకులు చెబుతున్నారు. డ్రైవర్లంతా కుమ్మక్కై తాము చెప్పిన రుసుములు ఇవ్వాల్సిందేనని ప్రయాణికులకు తేల్చి చెబుతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు దూరాన్ని బట్టి రూ.800 నుంచి రూ.1,500, అంతకుమించి కూడా వసూలు చేస్తున్నారు. అందరూ కలిసి దందా సాగిస్తుండటంతో ప్రయాణికులపై భారం పడుతోంది.