మహారాష్ట్రలోని ఠాణె నుంచి సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు వరకు హైస్పీడ్ రైలు(High speed train) మార్గంపై కసరత్తు మొదలైంది. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(National High Speed Rail Corporation Limited) ప్రతినిధులు బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. కొల్లూరు స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరేలా ప్రణాళిక వేస్తున్నట్లు వారు వివరించారు. ఈ స్టేషన్ పేరును హైదరాబాద్‌గా వ్యవహరించే అవకాశముందని తెలిపారు.
ఈ మార్గంలో హైదరాబాద్ (కొల్లూరు), వికారాబాద్, గుల్బర్గా, షోలాపుర్, పండరీపుర్, బారామతి, పుణె, లోనావాలా, నవీ ముంబయి, ఠాణె మొత్తం పది స్టేషన్లుంటాయి. పది బోగీలు.. 750 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఇది నడుస్తుందని, ప్రాజెక్టు పూర్తికి 1,197.5 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశామని వారు తెలిపారు. ప్రస్తుతం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో డీపీఆర్ పూర్తి కావొచ్చని కన్సల్టెన్సీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ రైలు(Hyderabad to Mumbai Bullet train) అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబయికి మూడు గంటల్లో చేరుకోవచ్చని వెల్లడించారు.
గంటకు మూడు వందల కిలోమీటర్ల వేగంతో ఈ రైలు(Hyderabad to Mumbai Bullet train) దూసుకెళ్తుంది. పది బోగీల్లో కలిపి ఏడు వందల యాభై మంది ప్రయాణికులు వెళ్లొచ్చు. ఎనిమిది జిల్లాలు, 294 గ్రామాల మీదుగా ఈ రైలు మార్గం ఏర్పాటు కానుంది. మన రాష్ట్రంలో కొల్లూరు, వికారాబాద్‌లలో స్టేషన్లు ఉంటాయి.
తెలంగాణలోని సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కలిపి 92 కిలోమీటర్ల దూరం బుల్లెట్ రైలు(Hyderabad to Mumbai Bullet train) పరుగులు తీయనుంది. ఇందుకోసం రాష్ట్ర పరిధిలో దాదాపు 172 హెక్టార్లలో భూమిని సేకరించాల్సి వస్తుందని అంచనా. ఇప్పటికే లిడార్ సర్వే పూర్తి చేశారు. మరో ఆరు నెలల్లో సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(detailed project report) సిద్ధం కానుంది.
"లిడార్ సర్వే తర్వాత డీపీఆర్ రూపొందిస్తున్నాం. ప్రజలకు అందరికి ఈ ప్రాజెక్టు ఉద్దేశం తెలిసేలా కార్యక్రమం ఏర్పాటు చేశాం. బుల్లెట్ ట్రైన్ డిజైన్ ప్రపోజల్ చేశాం. భూసేకరణ తక్కువగా ఉంటుంది. ఇది మొదటి దశలోనే ఉంది. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూసేకరణ చేపడతాం. హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్లడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఇది పర్యావరణ హితంగానే నిర్మిస్తాం. ఈ ట్రైన్ ద్వారా చాలా మందికి ఉపయోగం ఉంటుంది."
- రాజర్షీ షా, అదనపు పాలనాధికారి, సంగారెడ్డి జిల్లా
భవిష్యత్‌లో బుల్లెట్ రైలు(Bullet train from Hyderabad to Mumbai) సేవలు మొదలైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. పారిశ్రామికీకరణ వేగవంతం అవుతుంది. సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు సరికొత్త గమ్యస్థానంగా అవతరిస్తుంది.