Booster Dose in Telangana : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల పాటు బూస్టర్ డోస్ కూడా తప్పనిసరి అని వైద్యనిపుణులు సూచించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్ చార్మినార్ యునానీ ఆస్పత్రిలో బూస్టర్ డోస్ పంపిణీని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మొదటగా.. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ ఇస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు. గతంలో తీసుకున్న వారికి అదే రిజిస్ట్రేషన్‌తో వ్యాక్సిన్ ఇస్తున్నట్లు చెప్పారు.
60 ఏళ్లు దాటిన వారు 8.3 లక్షలు
Booster Dose Covid Vaccine : కొవిన్‌లో స్లాట్ బుకింగ్ ద్వారా నేరుగా టీకా కేంద్రానికి వెళ్లే వెసులుబాటు కల్పించినట్లు మంత్రి తెలిపారు. రెండో డోస్ వేసుకుని 9 నెలలు పూర్తయిన వారికే బూస్టర్ డోస్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వారు 8.3 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది.
Harish Rao on Booster Dose : 'ప్రభుత్వం అందరికీ ఉచితంగా టీకాలు అందిస్తోంది. వ్యాక్సినేషన్‌కు ప్రజాప్రతినిధులు సహకరించాలి. టీకా విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదు. మొదటి డోస్ 102 శాతం పూర్తి. 15-18 ఏళ్లవారిలో 38 శాతం మందికి మొదటి డోసు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉంది. వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తి చేసేందుకు యత్నిస్తున్నాం. యునానీ ఆస్పత్రిలో సమస్యలపై చర్చించాం. త్వరలోనే పరిష్కరిస్తాం. యునానీ ఆస్పత్రిలో ఖాళీల భర్త్తీకి 2,3 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం. ప్రొఫెసర్లు కూడా మరిన్ని సేవలు అందించాలి.'
- హరీశ్ రావు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి
MLA AKbaruddin Owaisi On Covid Vaccine : దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే కరోనా వ్యాక్సినేషన్ అత్యంత వేగంగా సాగుతోందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. టీకా పంపిణీలో రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టిన ఆరోగ్య శాఖకు అభినందనలు తెలిపారు. కొవిడ్ నియమాలు పాటించాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. టీకాపై అపోహలు వద్దని చెప్పారు.
వ్యక్తిగత ఇష్టంతోనే బూస్టర్టీకా..
Booster Dose Vaccination in Telangana : బూస్టర్ డోస్ పూర్తిగా వ్యక్తిగత ఇష్టంతో కూడుకున్నదని పేర్కొన్న ఆరోగ్య శాఖ.. వైద్యులను సంప్రదించిన అనంతరం బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది. గతంలో తీసుకున్న టేకానే తిరిగి మూడో డోస్‌గా ఇవ్వనున్నట్టు పేర్కొంది. గతంలో చేసుకున్న టీకా రిజిస్ట్రేషన్ ఆధారంగా కోవిన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. కొత్తగా ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదన్న వైద్యారోగ్యశాఖ.. నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకునే సదుపాయాన్ని కల్పించింది.