తెలంగాణ ప్రభుత్వ ఏడేళ్ల పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండం అని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. భాజపా అభ్యర్థులు గెలిస్తే.. మంత్రి కేటీఆర్ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాడా అని ప్రశ్నించారు. ఓవైసీ, కేటీఆర్‌లు ప్రొఫెసర్ నాగేశ్వర్ కోసం పనిచేస్తుంటే.. మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి... వాణీదేవి గెలుపు కోసం పనిచేస్తున్నారని విమర్శించారు.
కేటీఆర్.. ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని ప్రభాకర్ జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెరాసకు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని అన్నారు. నాయకత్వం తీరుతో తెరాస క్యాడర్ గందరగోళంలో ఉందని తెలిపారు. ఏమి చెప్పి ఓట్లు అడగాలో తెరాస పెద్దలకు అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు.
ఉద్యోగాల కల్పనపై చర్చకు రాకుండా కేటీఆర్ పారిపోయారని ప్రభాకర్ దుయ్యబట్టారు. ఉద్యోగాల కల్పనపై కేటీఆర్ కాకి లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కేసీఆర్‌ను కలవర పెడ్తున్నాయని అన్నారు. ఈ ఎన్నికలు భాజపాకు పూర్తి అనుకూలంగా ఉన్నాయన్న ఆయన.. ఉద్యోగాల విషయంలో కేంద్రాన్ని విమర్శించే అర్హత తెరాసకు లేదని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : నిపుణులైన డ్రైవర్ల కొరత తీర్చే ఐడీటీఆర్