భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) చేపట్టనున్న పాదయాత్ర పేరు ఖరారైంది. పాదయాత్ర పేరు ప్రజాసంగ్రామ యాత్రగా నిర్ణయించినట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. తొలిదశలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి హుజూరాబాద్ వరకు కొనసాగనుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తెరాస ప్రభుత్వం అమలుచేయలేదని విమర్శించిన రాజాసింగ్.. సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని స్పష్టం చేశారు.
" ఈ నెల 24 నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. తొలి విడత పాదయాత్ర భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రారంభమై హుజూరాబాద్‌లో ముగుస్తుంది. అవినీతి కుటుంబ పాలనను అంతం చేసేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్ర విజయవంతం చేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించాం. ఎన్నికల సమయంలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి మోసం చేశారు. కేసీఆర్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం."- రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే
2023 ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుందని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను కేసీఆర్.. అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని.. కేసీఆర్ ఖూనీ చేశారని విమర్శించారు. నీళ్లలో తెలంగాణకు ఎంత వాటా రావాలో కేసీఆర్‌కు సంతకం చేసేటప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్షం లేకుండా చేశారని రాజాసింగ్ మండిపడ్డారు. ఎవరి సొమ్ముతో తెలంగాణ అభివృద్ధి అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
నియంత పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ చేసే ఈ పాదయాత్రలో ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ప్రజలకు సంజయ్‌పై నమ్మకం పెరుగుతోందని అన్నారు. 2023 ఎన్నికలు జరిగే వరకు విడతల వారీగా ఈ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందని తెలిపారు.