రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేస్తూ... భాజపా నేడు నిరుద్యోగ దీక్షకు పూనుకుంది. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయం వేదికగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. ఇందిరాపార్కు వద్ద దీక్షను తలపెట్టినప్పటికీ పోలీసుల అనుమతి నిరాకరణతో వేదికను పార్టీ కార్యాలయానికి మార్చారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దీక్ష చేయనున్నారు. దీక్షను భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్ ప్రారంభించనున్నారు. 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా.. సీఎం కేసీఆర్ కళ్లకు కనిపించడం లేదన్న బండి సంజయ్.. నిరుద్యోగ దీక్షకు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కొవిడ్ నిబంధనలకు లోబడి దీక్ష చేపడుతుంటే ప్రభుత్వానికున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. నిరుద్యోగ దీక్ష’తో తెరాస పీఠం కదిలిపోతుందనే భయంతోనే ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
దీటుగా స్పందించిన తెరాస..
నిరుద్యోగ దీక్షపై దీటుగా స్పందించిన తెరాస.. ఉద్యోగ కల్పనపై తమ నిబద్ధతను ప్రశ్నించే నైతికహక్కు భాజపాకు లేదని విమర్శించింది. బండి సంజయ్‌ది అవకాశవాద, రాజకీయ నిరుద్యోగ దీక్ష అంటూ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. దేశ నిరుద్యోగ యువతకు.. భాజపా ఏం చేసిందో చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న భాజపా... హామీ ఏమైందన్న కేటీఆర్.. ఎన్ని కొలువులు ఇచ్చారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. కేంద్రం వల్ల రాష్ట్రానికి దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పాలని పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి నిరుద్యోగ యువతను నమ్మించి నట్టేట ముంచిన చరిత్ర.. భాజపాదేనని ప్రతిదాడి చేశారు.
40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా..
దేశంలో గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని ఆక్షేపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నది భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విమర్శించారు.
ఎదురుదాడి చేస్తున్నారు..
కేటీఆర్ లేఖపై స్పందిస్తూ.. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. ఉద్యోగాలెప్పుడిస్తారో చెప్పమంటే ఎదురుదాడి చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. బండి సంజయ్ దీక్షకు భయపడే కేటీఆర్ బహిరంగ లేఖ రాశారని ఎద్దేవా చేశారు. విద్యార్థి, నిరుద్యోగులంతా దీక్షకు తరలిరావాలని కోరారు.
ఇదీచూడండి: దీక్షకు అడ్డంకులు.. కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: బండి సంజయ్