BJP ST Morcha Protest: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై లోక్‌సభ కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలపై భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భాజపా ఎస్టీ మోర్చా ఆధ్యర్యంలో గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం తోసుకుని గాంధీభవన్‌వైపు దూసుకెళ్లేందుకు ఎస్టీ మోర్చా నేతలు, కార్యకర్తలు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మహిళా రాష్ట్రపతిపై కాంగ్రెస్ లోక్‌సభ ప్రతిపక్ష నేత అనుచిత వ్యాఖ్యలు చేయడం కుల అహంకారానికి నిదర్శమని భాజపా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ మండిపడ్డారు. ఒక మహిళా గిరిజన బిడ్డకు ఎటువంటి మర్యాద ఇవ్వాలో తమ పార్టీ నేతలకు సోనియా నేర్పించాలని హితవుపలికారు. దీనిపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. భాజపా వెనకబడిన అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుంటే.. ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ ధ్వజమెత్తారు. అధీర్‌రంజన్ చౌదరి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
"పార్లమెంటు సాక్షిగా.. ఓ మహిళా గిరిజన బిడ్డను రాష్ట్రపతి అని కూడా గౌరవం లేకుండా అవమానించారు. గిరిజనులు కేవలం ఓట్లు వేసేందుకే పనికొస్తారు.. ఎలాంటి పదవికి అర్హులు కాదనే అభిప్రాయంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అన్ని వర్షాలకు సమన్యాయం చేస్తున్న భాజపా పనితీరును ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు వెంటనే ద్రౌపతిముర్ముకు క్షమాపణలు చెప్పాలి." - హుస్సేన్ నాయక్, భాజపా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చూడండి: