ఎమ్మెల్సీ ఎన్నికల్ని భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని బరిలో దిగింది. ఒక్కో స్థానంలో వందల సంఖ్యలో సమావేశాలు నిర్వహించింది. ప్రతి 25 మంది ఓటర్లకు పార్టీ తరఫున ఓ ఇన్‌ఛార్జిని పెట్టింది. కేంద్రమంత్రులు ప్రకాశ్ జావడేకర్, రమేశ్ పోఖ్రియాల్, అనురాగ్‌సింగ్ ఠాకూర్‌లు సైతం రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ముఖ్యనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో రాంచందర్‌రావు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయం సాధించలేకపోయారు. మరో అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి పోటీ ఇవ్వలేకపోయారు.
ఆ ప్రభావం చూపింది!
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంతో గత ఎన్నికల్లో తెరాస, భాజపా మధ్య ఈ రెండు స్థానాల్లోనూ ముఖాముఖి పోటీ నెలకొంది. ఈసారి బలమైన స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంతో తాము ఓడిపోయినట్లు భాజపా నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. కొందరు సీనియర్ నేతలు ఈ ఎన్నికల్లో బాధ్యత తీసుకోకపోవడం, ప్రచారం ఎక్కువగా సభలకు పరిమితమై ఓటర్లను పూర్తిస్థాయిలో కలవకపోవడమూ కారణమైందని అంటున్నారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలో దింపకపోవడం, కోదండరాం, తీన్మార్ మల్లన్నలకు గణనీయంగా ఓట్లు రావడం ప్రభావం చూపిందని భాజపా నాయకులు భావిస్తున్నారు.
గట్టిగా దృష్టి పెట్టుంటే..
హైదరాబాద్ సిటింగ్ స్థానం కావడంతో విజయంపై భాజపా ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెరాస, భాజపా అభ్యర్థులిద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో ఆ ఓట్లు చీలిపోయాయని అంచనా వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ భారీ ఓట్లతో మూడో స్థానంలో నిలవడం, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభావం చూపడం కూడా ఓటమికి కారణాలయ్యాయని కమలనాథులు విశ్లేషిస్తున్నారు. ఈ స్థానంలో రెండో ప్రాధాన్యం ఓట్లపై గట్టి దృష్టి పెట్టి ఉంటే, విజయం సాధించి ఉండేవాళ్లమని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు.
మండలిలో భాజపా చోటు గల్లంతు
రెండు స్థానాల్లో తెరాస గెలవడంతో 40 మంది సభ్యులున్న మండలిలో ఆ పార్టీ బలం 36కు పెరిగింది. ‘హైదరాబాద్’లో భాజపా ఓటమితో మండలిలో ఆ పార్టీ స్థానం గల్లంతైంది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరఫున రాంచందర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత సభ్యులుగా పల్లా, రాంచందర్‌రావులకు ఈ నెల 29 వరకు పదవీ కాలం ఉంది. ఆ తర్వాతే కొత్తగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేస్తారు.
- ఇదీ చూడండి : ఎత్తుకుపైఎత్తు... ఫలించిన తెరాస వ్యూహం