సాదాబైనామాల అంశం తెరాస నాయకుల బినామీ వ్యవహారంగా మారిందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. అనేక గ్రామాల్లో తెరాస నాయకులు సాదాబైనామాలను దుర్వినియోగం చేస్తున్నారన్న ప్రభాకర్... హఫీజ్పేట్ భూ వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని దుయ్యబట్టారు. సీఎం బంధువులు దేవాలయ, వక్ఫ్ వంటి భూములపైన కన్నేశారని ఆరోపించారు.
వందలాది ఎకరాల భూముల ఒప్పందాలు సీఎం కార్యాలయంలోనే జరుగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దేవాలయ, వక్ఫ్ భూములను కాపాడాలని హితవు పలికారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక గడువులోపే అక్రమ నిర్మాణాలు చేపట్టాలని తెరాస చూస్తుందన్న ఆయన... అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెరాస అక్రమాల గురించి... పేర్లతో సహా పండగ తర్వాత బయట పెడతానని ప్రభాకర్ ప్రకటించారు.