Bharat biotech Rotavac vaccine: ప్రాణాంతక డయేరియా వ్యాధిని నిరోధించే రోటావ్యాక్ టీకాను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఆఫ్రికా ఖండానికి చెందిన నైజీరియాకు సరఫరా చేయనుంది. నైజీరియా ప్రభుత్వం సార్వత్రిక టీకాల కార్యక్రమంలో రోటావ్యాక్‌ను చేర్చి, చిన్నపిల్లలు అందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. ఎందుకంటే అక్కడ డయేరియా వ్యాధి మరణాలు ఎక్కువ ఉంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే చిన్నపిల్లల మరణాల్లో 14 శాతం నైజీరియాలోనే చోటుచేసుకుంటున్నాయి. అక్కడ ఏటా దాదాపు 50,000 మంది పిల్లలు ఈ వ్యాధితో చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో రోటావ్యాక్ టీకా తీసుకోవాలని నైజీరియా నిర్ణయించింది. దశాబ్దాల పాటు పరిశోధనలు నిర్వహించి ఈ టీకాను ఆవిష్కరించినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్య ప్రాచ్య దేశాల్లో దీన్ని ఇప్పటికే ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి మనదేశం నుంచి తక్కువ ధరలో టీకాలు అందిస్తున్నట్లు వివరించారు. రోటా వైరస్ వల్ల వ్యాపించే డయేరియా వ్యాధిని ఈ టీకా సమర్థంగా అదుపు చేస్తుందన్నారు. రోటావ్యాక్ టీకాను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేసింది. దీనిలో కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖతో పాటు 16 జాతీయ- అంతర్జాతీయ సంస్థలు భాగం పంచుకున్నాయి. ఈ టీకాకు 2018 జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు (ప్రీ-క్వాలిఫికేషన్) లభించింది.