కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకోవాలంటూ చేపట్టిన భారత్ బంద్‌కు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాలు మద్దతు పలికాయి. వ్యాపారులు ఉద్యోగులు, కార్మికులు, స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నాం వరకూ ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో ఉదయం నుంచే డిపోల ఎదుట పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. వ్యాపార సంస్థలు, దుకాణ సముదాయాలు తెరుచుకోలేదు.
భారత్‌బంద్‌కు అధికార తెరాస సంపూర్ణ మద్దతు పలికింది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎంపీలు, నేతలు ప్రదర్శనలు రాస్తారోకోలు నిర్వహించారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్‌లోని జాతీయ రహదారిపై మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. షాద్‌నగర్ బూర్గుల గేట్ వద్ద మంత్రి కేటీఆర్.... జాతీయ రహదారిపై బైఠాయించారు. కొత్త చట్టాలు కార్పొరేట్లకు వరంగా మారి.... రైతుల హక్కులు హరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సన్నధాన్యం కొనేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉన్నా... నిబంధనల పేరుతో కేంద్రమే అడ్డుపడుతోందని కేటీఆర్ ఆరోపించారు.
మెదక్ జిల్లా తూప్రాన్ లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెరాస కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి హైదరాబాద్ -విజయవాడ రహదారిని దిగ్బంధించారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్టీసీ బస్టాడ్ ఎదుట ఆందోళన చేపట్టారు.
మహబూబాబాద్ లో మంత్రి సత్యవతి రాఠోడ్ , ఎమ్మెల్యే శంకర్ నాయక్ కార్యకర్తలతో కలిసి... ఎద్దులబండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ , కడియం శ్రీహరి, రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ మడికొండలో భారత్‌బంద్‌లో పాల్గొన్నారు.
నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికార పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ చౌరస్తాలో బంద్‌కు మద్దతుగా చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బి.బి.పాటిల్, ఎమ్మెల్యేలు గంప గోవర్దన్, సురేందర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ వద్ద రైతులతో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్‌లో మంత్రి ఈటల రాజేందర్ నిరసనల్లో పాల్గొన్నారు. కేంద్రానికి సెగ తగిలే వరకు నిరసనలు కొనసాగిస్తామని కరీంనగర్‌లో జరిగిన ఆందోళనల్లో మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన దర్నా పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామానాగేశ్వరరావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి...అన్నదాతల వెన్నువిరిచే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం తీసుకువచ్చిన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెరాస ఎమ్మెల్యేలు, నేతలు ఆందోళనలు నిర్వహించారు. కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: భారత్ బంద్ ప్రశాంతం- రైతు కోసం కదిలిన జనం