Bandi Sanjay: తమ సమస్యలను పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళన.. నాలుగోరోజు కొనసాగుతోంది. ప్రధానమైన 12 డిమాండ్లను లెవనెత్తిన విద్యార్థులు నాలుగురోజులుగా... నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు పార్టీలు విద్యార్థుల ఆందోళనలకు మద్దతివ్వగా... ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బయల్దేరారు. భారీ కాన్వాయ్‌తో బయల్దేరిన బండి సంజయ్‌ను కామరెడ్డి పోలీసులు అరెస్టు చేశారు.
బికనూర్ టోల్ ప్లాజా వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల సమస్యలు వినడానికి వెళుతున్న తనను అరెస్ట్ చేయడమేంటని బండి సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. విద్యార్థులు వారి సమస్యలపై ఆందోళన చేస్తుంటే... కరెంట్ కట్ చేయటం, నీరు దొరకకుండా చేయడం ఏంటని ప్రశ్నించారు. వారేమైనా తీవ్రవాదులా అని మండిపడ్డారు. సీఎం వారి సమస్యలపై స్పందిస్తే ఇంత దూరం వచ్చేది కాదని.. ఏదేమైనా వారి సమస్యలు పరిష్కరించేంతవరకూ పోరాడతామని పిలుపునిచ్చారు. బండి సంజయ్‌ను బాసరకు పంపించాలని మహిళా కార్యకర్తలు, నాయకులు వాహనానికి అడ్డుపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట జరిగింది. భాజపా నేతలు రోడ్డుపై నిరసన తెలుపుతుండగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
'విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కరెంట్, నీళ్లు కట్ చేయడమేంటి? వాళ్లేమైన తీవ్రవాదులా ? స్టూడెంట్స్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన సీఎం సిల్లీ సమస్యలంటూ రెచ్చగొడతారా? ముఖ్యమంత్రి విద్యార్థులతో మాట్లాడితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. సమస్యలు తెలుసుకోవాలని వెళ్తే అడ్డుకుంటారా? ట్రిపుల్ ఐటీలో చదువుకునే వాళ్లంతా పేద విద్యార్థులే... వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరడం తప్పా? విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంతవరకూ పోరాడతాం.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
అసలేం జరిగిందంటే.. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో నెలకొన్న సమస్యలు, సౌకర్యాల కొరత, సామగ్రి సరఫరాలో యాజమాన్య నిర్లక్ష్యంపై విద్యార్థులు గళమెత్తారు. సుమారు ఆరు వేల మంది విద్యార్థులు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిపాలన భవనం ఎదుట బైఠాయించారు. రెండురోజుల కిందట విద్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో ఆందోళనకు దిగామన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి విద్యాలయానికి శాశ్వత ఉపకులపతి నియామకం జరపకపోవడం, మూడేళ్లుగా ల్యాప్‌టాప్‌ల సరఫరా, ఏకరూప దుస్తుల పంపిణీ లేకపోవడం, నాణ్యమైన భోజనం పెట్టకపోవడంపై ధర్నా చేపట్టినట్లు విద్యార్థులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా స్పందన లేదన్నారు. సీఎం కేసీఆర్ తమ విద్యాలయానికి రావాలని డిమాండ్ చేశారు. సమస్యలపై స్పందించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు.
ఇవీ చదవండి: