Atmakur Bypoll Voting : ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు (ఎస్‌పీఎస్‌ఆర్) నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక జరుగుతోంది.ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వైకాపా తరఫున మేకపాటి విక్రమ్‌రెడ్డి, భాజపా తరఫున జి.భరత్‌కుమార్ యాదవ్, మరో 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2,13,400 మంది ఓటర్లకు 279 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తో పాటు.. 78 వెబ్‌క్యాస్టింగ్ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్.చక్రధర్‌బాబు వెల్లడించారు. ఓటర్లందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉపఎన్నిక స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని చెప్పారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 26వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
పోలింగ్ విధుల్లో 1,409 మంది సిబ్బంది.. ఉపఎన్నిక నిర్వహణకు మొత్తం 1,409 మంది అధికారులు, ఇతర సిబ్బందిని నియమించినట్లు రిటర్నింగ్ అధికారి హరేంధిర ప్రసాద్ తెలిపారు. 198 ప్రాంతాల్లో 279 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 363 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, 391 వీవీ ప్యాట్స్‌ను పంపిణీ చేశారు. సమస్యాత్మకమైన 123 కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికకు 72 గంటల ముందుగానే బయట ప్రాంతాలకు చెందిన నాయకులు, ఇతర వ్యక్తులు ఎవరు లేకుండా చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ అధికారి చెప్పారు. ఇప్పటివరకు 550 లీటర్ల మద్యం, రూ.14.61 లక్షలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
వైకాపా తరఫున పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఐటీ, పరిశ్రమల మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి.. ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి నేడు ఉపఎన్నిక జరగనుంది. జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మూడు మిలిటరీ బెటాలియన్లు, ఆరు పోలీస్ పోలీస్ స్పెషల్ ఫోర్స్ టీమ్, ముగ్గురు డీఎస్పీలు, 18 మంది సీఐలు, 36 మంది ఎస్ఐలు,900 మంది స్థానిక పోలీసు సిబ్బందితో కలిపి.. మొత్తం సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందిని ఈ ఎన్నికల పర్యవేక్షణకు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.