TTD: సామాన్య భక్తులకు గంటల కొద్దీ నిరీక్షణ లేకుండా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. వీరికి సర్వదర్శనం గంటన్నర వ్యవధిలోనే చేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా రూ.300తో దర్శనంతో పాటు వివిధ సేవలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. బుధవారం ఆయన ‘ఈనాడు- ఈటీవీ భారత్’తో పలు అంశాలపై మాట్లాడారు.
- ఏప్రిల్ 12 వరకు టైమ్‌స్లాట్ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేవారు. క్యూలైన్లలో తోపులాట కారణంగా నేరుగా క్యూ కాంప్లెక్స్‌లోకి వెళ్లి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశాం. తిరుపతిలోని శ్రీభూదేవి కాంప్లెక్స్‌తోపాటు విష్ణునివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో టైమ్‌స్లాట్ టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించే పనులు పూర్తవగానే టైమ్‌స్లాట్ విధానాన్ని పునరుద్ధరిస్తాం.
- ఈ నెలాఖరు వరకు వేసవి రద్దీ కొనసాగుతుంది. దీనికి అనుగుణంగా సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టాం. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను తీసుకోవట్లేదు. వారికి గంటన్నరలోనే దర్శనం పూర్తి చేసి మిగిలిన సమయాన్ని సామాన్య భక్తుల కోసం కేటాయిస్తున్నాం.
- శ్రీవాణి ట్రస్టుకు వస్తున్న నిధులను మళ్లిస్తున్నారన్న ఆరోపణలు సరికాదు. ట్రస్టుకు వచ్చిన నిధులతో 150 కొత్త ఆలయాలను నిర్మించనున్నాం. దాదాపు 100 పురాతన ఆలయాలకు నిధులు కేటాయించాం. మరో 500 గుడుల పునరుద్ధరణకు నిర్ణయించాం. ఇందుకోసం ఆలయాల వివరాలు పంపాలని దేవాదాయశాఖకు లేఖ రాశాం.
- గత రెండున్నరేళ్ల కాలంలో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నాం. 124 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 217 మందిని అరెస్టు చేయించాం. 216 బైండోవర్ కేసులు పెట్టి, 1377 మందిని తిరుమల కొండకు రాకుండా నిరోధించగలిగాం. దీనివల్ల ఏడాదికి దళారుల చేతుల్లోకి వెళ్లే సుమారు రూ.215 కోట్లు.. శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామికి చేరుతున్నాయి.
- తిరుమలలో ఉన్న 7,500 గదులకు 40 ఏళ్లుగా మరమ్మతులు చేయలేదు. కొవిడ్ సమయంలో ఈ పనులు చేపట్టాం. 4,500 గదుల మరమ్మతులు పూర్తి చేశాం. 750 గదుల పనులు నడుస్తున్నాయి. సెప్టెంబరు నాటికి అన్నింటి మరమ్మతులు పూర్తి చేస్తాం. ఇవి కాకుండా భక్తులకు ఐదు పీఏసీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ 40 వేల మందికి మాత్రమే గదులు ఇచ్చే వెసులుబాటు ఉంది. తిరుమల కాంక్రీట్ అరణ్యంలా మారకూడదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కొత్తగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం లేదు. భక్తులు తిరుపతిలోని వసతిగృహాలను సద్వినియోగం చేసుకుంటే రద్దీ సమయంలో ఇబ్బందులు తప్పుతాయి.
- తిరుమలకు వచ్చేందుకు అటు అన్నమయ్య మార్గాన్ని నిర్మించాలని బోర్డులో తీర్మానించాం. అటవీ అనుమతుల కోసం అక్కడ సర్వే పూర్తి చేసి నివేదిక పంపించాం. అన్ని అనుమతులు రాగానే పనులు చేపడతాం.
- రెండున్నరేళ్లలో రూ.1500 కోట్ల విరాళాలను తీసుకురాగలిగాం. దీనివల్ల హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర పనులకు ఉపయోగించకుండా బ్యాంకుల్లో జమ చేసేందుకు అవకాశం కలిగింది.
ఇవీ చూడండి..: