తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదాలకు సంబంధించి ఆగస్టు 5న అత్యున్నత మండలి సమావేశం కానుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌తో కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ భేటీ కానున్నారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన, నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు ఇటీవల పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.... కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు కోసం ఉత్తర్వుల జారీతో ఫిర్యాదులు ఊపందుకున్నాయి.
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లోనూ పరస్పరం భిన్న వాదనలు వినిపించాయి. పొరుగు రాష్ట్ర ప్రాజెక్టులతో.. తమ ప్రయోజనాలకు భంగం కలుగుతోందని వాదించాయి. కొత్త ప్రాజెక్టుల పనులు ఆపాలని, ఫిర్యాదులు వచ్చిన ప్రాజెక్టుల సవివర నివేదికలు ఇవ్వాలని.. ఆయా బోర్డులు ఇరు రాష్టాలను కోరాయి. డీపీఆర్ ఇవ్వాలని గతంలోనే పలుమార్లు సూచించినా.. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవి అందడం లేదని వ్యాఖ్యానించాయి. రెండు రాష్ట్రాలు వివిధ అంశాలను పలుమార్లు లెవనెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే వచ్చేనెల 5న అత్యున్నత మండలి సమావేశాన్నికేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం అజెండా పంపాలని ఇరురాష్ట్రాలు, బోర్డులకు గతంలోనే కేంద్రం సూచించింది. రెండు రాష్ట్రాల ఫిర్యాదులు, బోర్డులు సూచించే అంశాలపై భేటీలో చర్చించనున్నారు. కొవిడ్ నేపథ్యంలో సమావేశం నేరుగా కాకుండా దృశ్య మాధ్యమం ద్వారా జరగనుంది.
ఇవీ చూడండి: ఏ చావైనా.. కొవిడ్ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల