AP HIGH COURT ON TTD : తిరుమలలోని అంజనాద్రి కొండపై సుందరీకరణ పనులు తప్ప.. దేవాలయ ఏర్పాటు, ఇతర నిర్మాణాలు చేపట్టవద్దని తితిదేని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సుందరీకరణ, భూమి పూజ కార్యక్రమాలు చేపట్టవచ్చని తెలిపింది. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. దీనిపై ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, తితిదే ఈవోకు నోటీసులు జారీచేసింది.
తిరుమల శ్రీవారి వైభవాన్ని తగ్గించే విధంగా.. అంజనాద్రి దేవాలయ నిర్మాణం చేపట్టబోతున్నారని పేర్కొంటూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరుమల కొండల్లో మనుషుల చేతుల మీదుగా ఎలాంటి విగ్రహాన్ని ప్రతిష్టించకూడదని, పురాణాలు అదే విషయాన్ని చెబుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. ఆంజనాద్రి కొండపై హనుమంతుడు జన్మించారనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. హనుమంతుని జన్మస్థానం పేరుతో అంజనాద్రి కొండను ఏడు కొండల నుంచి వేరు చేసే యత్నం జరుగుతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.