AP Legislative Council Abolition: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసన మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. గతంలో చేసిన మండలి రద్దు తీర్మానంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోనందున.. అప్పటి తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నట్లు పీటీఐ వార్త కథనం వెలువరించింది.
ఏపీ శాసన మండలిని రద్దు చేయాలంటూ గత ఏడాది జనవరి 27న సీఎం జగన్.. అసెంబ్లీలో తీర్మానం చేశారని... ప్రజాప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం అప్పట్లో ప్రకటించారని పీటీఐ వెల్లడించింది. గతంలో మండలిలో మైనార్టీలో వైకాపా ప్రభుత్వం ప్రస్తుతం ఆధిక్యంలోకి వచ్చినట్లు తెలిపిన పీటీఐ వార్తా సంస్థ.. ఈ పరిస్థితుల్లో మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని వెల్లడించింది. రద్దుపై నిర్ణయం తీసుకోవాలంటూ 22 నెలలుగా కేంద్రానికి వివిధ సందర్భాల్లో వివరించినా ఫలితం లేకపోవడంతో పాటు అంశాన్ని చాలా కాలంగా పెండింగ్‌లో పెట్టిందని మంత్రి బుగ్గన తెలిపినట్లు పేర్కొంది. దీనిపై సభ్యుల్లో సందిగ్ధత ఏర్పడిందన్న మంత్రి.. వాటన్నింటికీ తెరదించుతూ మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభలో ప్రకటించారని వెల్లడించింది. ఈ మేరకు కౌన్సిల్ రద్దు నిర్ణయాన్ని విరమించుకుంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు పీటీఐ తెలిపింది.
మూడు రాజధానుల బిల్లు సైతం..
పీటీఐ వార్త సంస్థ కథనం ప్రకారం.. ఏపీ ప్రభుత్వం నిన్న కూడా ఓ కీలక చట్టాన్ని వెనక్కి తీసుకుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న బిల్లులో కొన్ని న్యాయపరమైన సమస్యలున్నాయన్న జగన్.. పూర్తి వివరాలతో మరో బిల్లును సభ ముందుకు తీసుకువస్తామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
మెరుగైన బిల్లు తెస్తాం: సీఎం జగన్
వికేంద్రీకరణకు మరింత మెరుగైన బిల్లు తెస్తామని ముఖ్యమంత్రి జగన్(cm jagan on repeal three capital laws) శాసనసభలో స్పష్టం చేసినట్లు పీటీఐ వార్త సంస్థ పేర్కొంది. 2020 నాటి చట్టం స్థానంలో కొత్త బిల్లు తెస్తామని.. విస్తృత ప్రజాప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమని సీఎం ప్రకటించారు. వికేంద్రీకరణపై అనేక అపోహలు, అనుమానాలు వచ్చాయని వెల్లడించిన ముఖ్యమంత్రి.. వికేంద్రీకరణపై న్యాయపరమైన వివాదాలు వచ్చాయన్నారు. చట్టాన్ని మరింత మెరుగ్గా తెచ్చేందుకే ఈ నిర్ణయమని తెలిపిన ముఖ్యమంత్రి.. వికేంద్రీకరణే తమ ప్రభుత్వ అసలైన ఉద్దేశమని సీఎం తెలిపినట్లు పీటీఐ వెల్లడించింది.
ఇవీచూడండి: