ఏపీలో.. అమరావతి భూముల క్రయవిక్రాయలకు సంబంధించి.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు.. సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ లోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని ఇళ్లకు వెళ్లి.. వేర్వేరుగా నోటీసులు ఇచ్చారు.
మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు.. సీఐడీ పోలీసులు మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై ఎస్సీ, ఎస్టీ సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. గత ప్రభుత్వం.. తమకు పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకుందని.. మంగళగిరి నియోజకవర్గంలోని కొందరు రైతులు తన దృష్టికి తెచ్చినట్లు ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24న ఫిర్యాదు చేశారని అధికారులు వివరించారు.అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్ల ఎస్సీ,ఎస్టీలకు నష్టం జరిగే అవకాశముందని,.. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో కోరారు. దీనిపై.. విజయవాడ సీఐడీ రీజినల్ అధికారి సూర్య భాస్కర్‌తో ప్రాథమిక విచారణ జరిపించారు.
సంబంధిత అంశాలపై.. తప్పులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సూర్యభాస్కర్ నివేదిక ఇచ్చినట్లు.. సీఐడీ డీఎస్పీ స్పష్టం చేశారు. ఆ నివేదిక ఆధారంగా బారత శిక్షాస్మృతిలోని..సెక్షన్ 166,167,217,120-B, ఐపీసీ రెడ్ విత్ 34,35,36,37 సెక్షన్లు, ఎస్సీ ,ఎస్టీ , ఏపీ ఎస్సైన్డ్ భూముల చట్టం కింద..ఈనెల 12న కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీని గుంటూరులోని ఆరో.. అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు సమర్పించినట్లు తెలిపారు . సీఐడి సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణను కేసు విచారణాధికారిగా నియమించారు . ఎఫ్ఐఆర్ ఆధారంగా చంద్రబాబుతోపాటు అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణను విచారించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ వెళ్లి నోటీసులు అందజేశారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు హాజరుకావాలని.. నోటీసులో పేర్కొన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని కోరారు.
- ఇదీ చూడండి : కేరళ ఎన్నికల్లో 'ట్వంటీ 20'