కడప జిల్లాకు చెందిన ఓ మహిళ కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. చికిత్స కోసం నెల్లూరు జిల్లా క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వారు చెప్పినట్లుగానే కొవిడ్ పరీక్ష చేయించుకొగా.. పాజిటివ్ వచ్చింది. నెల్లూరు జిల్లా కేంద్రంలో బెడ్లు లేవని బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు.
చేసేది లేక కలవాయి మండలంలోని రామన్న గారిపాలెంలో ఉంటున్న అన్నదమ్ముల ఇంటికి వెళ్లాలనుకుంది. ఈ విషయాన్ని వారికి ఫోన్ చేసి చెప్పింది. కరోనా సోకిన కారణంగా తోడబుట్టిన వారు ఇంటికి తీసుకువెళ్లలేకపోయారు. చేసేది లేక అక్కడే పొలాల్లో ఒంటరిగా ఉండిపోయింది. తన సోదరిని అలా ఒంటరిగా వదిలేయ లేకపోయారు ఆ అన్నదమ్ములు . రాత్రుళ్లు తన సోదరి ఉంటున్న చోటు నుంచి కాస్త దూరంలో ఆమెకు తోడుగా కాపలాకాశారు. ఇలా రెండ్రోజలు పాటు ఆ మహిళ చికిత్స అందక నరకయాతన అనుభవించింది. ఎట్టకేలకు రెండు రోజుల తరువాత స్పందించిన సిబ్బంది అంబులెన్స్‌ను పంపించారు.
బాధితురాలిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. దీంతో అన్నదమ్ములు ఊపిరిపీల్చుకున్నారు. కష్టం వస్తే ఆదుకునే దిక్కు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కన్నీరుపెట్టుకున్నారు.
ఇవీ చూడండి: