RUIA Hospital Incident : తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అంబులెన్స్ డ్రైవర్లు మాఫియాలా తయారయ్యారు. కుమారుడు చనిపోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న ఓ అభాగ్యుడితో అమానవీయంగా వ్యవహరించారు. వేలరూపాయల ఛార్జీ భరించలేనని మొత్తుకున్నా కనికరించలేదు. అతని యజమాని తక్కువ ధరకు అంబులెన్స్ మాట్లాడి పంపితే.. అడ్డుకున్నారు. చేసేది లేక కుమారుడి మృతదేహాన్ని భుజంపై వేసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరాల్సి వచ్చింది. హృదయవిదారకమైన ఈ ఘటన రుయా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీ కేసీ ఎస్టీ కాలనీకి చెందిన కంభంపాటి నరసింహులు తన కుమారుడు జాషువా(10)ను కిడ్నీ సమస్య కారణంగా ఈ నెల 24న రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి బాలుడు మృతి చెందాడు.
Tirupati RUIA Hospital Incident : మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆసుపత్రి ప్రాంగణంలోని అంబులెన్స్‌లను విచారించారు. కొండూరుకు వెళ్లడానికి రూ. 20,000 అడిగారు. కూలి పని చేసుకుని బతికే అతడు అంత డబ్బులు ఇవ్వలేక ఈ విషయాన్ని తన యజమానికి ఫోన్ చేసి చెప్పి ఆవేదన చెందాడు. 110 కి.మీ. దూరానికి అంత డబ్బు ఎందుకన్న ఆయన.. ఆన్‌లైన్‌లో పరిశీలించి రూ. 5,000కు ఓ అంబులెన్స్ మాట్లాడి రుయా వద్దకు పంపించారు. అక్కడే ఉన్న అంబులెన్స్ మాఫియా ఆ వాహనాన్ని అడ్డుకుంది. డ్రైవర్‌ను బెదిరించింది. చేసేది లేక రాత్రి వేళ నరసింహులు కొడుకు మృతదేహాన్ని భుజాలపై వేసుకుని ఆసుపత్రి బయటికి వచ్చారు. అంబులెన్స్‌తో పాటే వచ్చిన దాని యజమాని తన ద్విచక్ర వాహనంపై ఎక్కమని కోరారు. సుమారు 12 కి.మీ. ప్రయాణించి అక్కడ తాము మాట్లాడుకున్న అంబులెన్స్‌లో ఎక్కించి మృతదేహాన్ని తన సొంత ఊరికి తీసుకెళ్లారు.
అధికారులపై సస్పెన్షన్ వేటు : మంగళవారం ఉదయం ఈ వ్యవహారం బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డి వెంటనే స్పందించారు. ఆర్డీవో కనక నరసారెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీహరి, డీఎస్పీ మురళీకృష్ణతో కమిటీ వేసి వెంటనే ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వారు రుయా ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఇదే సమయంలో అఖిలపక్ష నేతలు అధికారులను అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విచారణ జరిపిన కమిటీ సభ్యులు ప్రైవేటు అంబులెన్స్ మాఫియా నిజమేనని నిగ్గుతేల్చారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎస్ ఆర్‌ఎంవో సరస్వతీదేవిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆర్డీవో, ఆర్టీవో, పోలీసు, డీఎంహెచ్‌ఓలతో సమావేశం నిర్వహించి ధరలు నిర్ణయించి ఆస్పత్రిలో ప్రదర్శిస్తామని తెలిపారు. అంబులెన్స్‌ను అడ్డుకున్న నరసింహులు, కృష్ణమూర్తి, సురేష్, ప్రభు, శేఖర్, దొరైరాజ్‌లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
గతంలోనూ ఇదే తీరు: 2020లో రుయా అత్యవసర విభాగంలోని ఓ రోగిని విశాఖకు తీసుకెళ్లడానికి ఇక్కడి అంబులెన్స్ అసోసియేషన్ సభ్యులు రూ.15,000 అడిగారు. రోగి బంధువులు బయట వేరే వాహనాన్ని రూ.8,000కు మాట్లాడుకుని తీసుకురాగా, మాఫియా సభ్యులు ఆ వాహనం డ్రైవర్‌పై దాడికి దిగారు. 2021లో ఓ రోగిని చెన్నైకి తరలించేందుకు రుయాకు బయటి అంబులెన్స్‌ను అడ్డుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ఏడాది కొవిడ్ సమయంలో ఓ మృతదేహాన్ని తరలించడానికి ప్రైవేటు అంబులెన్స్ యజమాని రూ.10,000 అడిగాడు.
అందరూ బెదిరించారు: రుయా ఆసుపత్రిలో నర్సుల నుంచి అంబులెన్సు డ్రైవర్ల వరకు అందరూ బెదిరించారని మృతుడు జాషువా బంధువైన శివకుమార్ ఆరోపించారు. ‘ఓ వైపు చిన్నారి చనిపోయాడనే బాధతో అల్లాడుతుంటే మరోవైపు శవాన్ని త్వరగా తీసుకెళ్లాలి.. లేదంటే మార్చురీకి తరలిస్తామని నర్సులు, సిబ్బంది గట్టిగా హెచ్చరించారు. అంబులెన్స్ డ్రైవర్లు రూ.20,000 డిమాండ్ చేశారు. దిక్కుతోచని స్థితిలో ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని తీసుకుని బయలుదేరాల్సి వచ్చింది.’ అని వాపోయాడు.
ప్రీ-పెయిడ్ ట్యాక్సీల పరిశీలన- మంత్రి రజని: రుయా ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు. మహాప్రస్థానం వాహనాలు రాత్రి సమయాల్లోనూ నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహాల తరలింపునకు ప్రీ-పెయిడ్ ట్యాక్సీలను నడిపే విషయాన్నీ పరిశీలిస్తామని పేర్కొన్నారు.
అక్కరకు రాని మహాప్రస్థానం వాహనాలు: రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో 4 మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉన్నా.. చిన్నారి జాషువా మృతదేహం తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లే దిక్కయ్యాయి. నర్సులు మహాప్రస్థానం వాహనదారులకు సమాచారం ఇవ్వకపోవడం.. సంబంధిత ఆర్‌ఎంఓ అందుబాటులో ఉండి పర్యవేక్షించకపోవడమే దీనంతటికీ కారణంగా కనిపిస్తోంది.
వ్యవస్థల విధ్వంసానికి ఇదే నిదర్శనం- చంద్రబాబు: ‘రుయా ఆసుపత్రిలో బాలుడి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమే. ఈ ఘటన నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది’ అని తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. వ్యవస్థల విధ్వంసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. తన కుమారుడికి జరిగినంత బాధ కలిగిందని తెదేపా జాతీయ కార్యదర్శి లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన కలచివేసిందని, ఈ దుస్థితికి ప్రభుత్వమే కారణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించారు.
ఇవీ చదవండి: