ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి భూముల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 22న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భూములపై సీఐడీ, సిట్ దర్యాప్తును నిలుపుదల చేస్తూ.. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ వినీత్ శరణ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ థావన్ వాదనలు వినిపించారు. ఈ అంశంపై హైకోర్టులోనే పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సి ఉందన్న రాజీవ్ థావన్.. పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అమరావతి భూముల విషయంలో సీబీఐతో దర్యాప్తు చేయించినా తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు.
విచారణకు సిట్టింగ్ లేదా విశ్రాంత జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపైనే సుప్రీంను ఆశ్రయించామన్న ప్రభుత్వం.. ప్రస్తుత స్థాయిలో సుప్రీం విచారణ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. హైకోర్టులో కౌంటర్‌కు అవకాశం ఇవ్వకుండా మధ్యంతర ఆదేశాలిచ్చారని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. విచారణ పూర్తయ్యే వరకూ ఎలాంటి చర్యలు చేపట్టబోమని సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఇదీ చదవండి: Viral Vidoe: శునకం రోడ్డు దాటేందుకు బాలుడి సాయం