Amaravati Farmers Protest : అమరావతి ఉద్యమం 800 రోజుల మైలురాయిని చేరుకుంది. ఏకైక రాజధాని డిమాండ్‌తో ఉద్యమిస్తున్న రైతులు, మహిళలు.. అదే పట్టుదల కొనసాగిస్తున్నారు. 800 రోజుల సందర్భంగా 24 గంటల సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. అమరావతి ఉద్యమంలో అసువులుబాసిన వారికి నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించారు. ఇవాళ ఉదయం 9 గంటలకు మొదలైన ఈ ప్రజాదీక్ష.. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగనుంది. రాజధాని పరిధిలోని వెలగపూడిలో చేపట్టిన దీక్షకు వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపీని ఆర్థికంగా అధోగతికి దిగజార్చిన ప్రభుత్వం.. అమరావతి భూములను అమ్ముతామంటే సహించేది లేదని హెచ్చరించారు. రాజధాని అభివృద్ధికి భూములను ఉపయోగించకుండా.. సంక్షేమం పేరిట పప్పుబెల్లాల్లా పంచుతామంటే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. మార్చిలో ఉత్తరాంధ్ర నుంచి జేఏసీల ఏర్పాటు, రౌండ్ టేబుల్ సమావేశాలు సైతం నిర్వహిస్తామని రాజధాని రైతులు వెల్లడించారు.
మహిళలదే ప్రధాన పాత్ర..
Amaravati Issue : అమరావతి ఉద్యమంలో మహిళలదే ప్రధాన పాత్ర. వారికి రైతులు, యువకులు తోడయ్యారు. పాదయాత్రలు, ద్విచక్రవాహనాల ర్యాలీ, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శనలతో పాటు.. రైతు గర్జన, జనభేరి కార్యక్రమాల్ని నిర్వహించారు. 100వ రోజు నుంచి 700వ రోజు వరకూ.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. వారి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతి సందర్భంలోనూ.. విజయం రైతన్నదే. ఇక న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర విజయవంతం గురించి.. జనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.
కేంద్రం చెబుతున్నా..
AP Capital Issue : ఇన్నిరోజులూ భిన్నరూపాల్లో నిరసన తెలిపినా.. ప్రభుత్వ తీరులో మార్పు రావట్లేదని.. అమరావతి రైతులు అంటున్నారు. ఏపీ రాజధాని అమరావతేనంటూ కేంద్రమే చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుల్ని మళ్లీ తెస్తే.. తాడోపేడో తేల్చుకునేవరకూ విశ్రమించబోమని.. రైతులు తేల్చిచెప్పారు.
అమరావతి ప్రజలకు ఉద్యమాభివందనాలు..
Three Capitals Issue in AP : ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ.. 800 రోజులుగా ఉద్యమం చేస్తున్న ప్రజలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. రైతుల ఉద్యమానికి, పోరాటానికి తెదేపా ఎప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద కక్షను పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నానన్నారు. తన మూర్ఖపు వైఖరితో రాష్ట్రంలో లక్షల కోట్ల సంపదను సృష్టించే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసిన జగన్ తప్పులను.. చరిత్ర ఎప్పటికీ క్షమించదని అన్నారు. రాజధాని ప్రాంతం స్మశానం అన్న వాళ్లే.. ఇప్పుడు అమరావతి భూములను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారని విమర్శించారు.
నియంతగా మారిన పాలకుల విద్వేష నిర్ణయాలకు వ్యతిరేకంగా 800 రోజులుగా జై అమరావతి నినాదంతో.. మొక్కవోని దీక్షతో పోరాడుతున్న రైతులు, మహిళలు, యువతకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం ఉద్యమాభివందనాలు తెలిపారు.