అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలంటూ... అన్నదాతలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, పెదపరిమిలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయం మార్చుకునేంతవరకు ఉద్యమం ఆపబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేసి ఆంధ్రుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందని కమలానంద భారతి ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడలో అమరావతి ఐకాస ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై కమలానంద... అమరావతిని ఉద్దేశించి మాట్లాడారు. భూములు ఇచ్చిన రైతులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 85 రోజులుగా మహిళలు రోడ్డుపైకి వచ్చి ఉద్యమం చేస్తుంటే... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. పవిత్రమైన అమరావతి నుంచి రాజధానిని ఎవ్వరూ మార్చలేరని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునేంత వరకు ఉద్యమం ఆపబోమని స్పష్టం చేశారు.
రాజధాని గ్రామాల్లో 85వ రోజు నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. మూడు రాజధానులు వద్దంటూ... రైతులు, మహిళలు గళమెత్తారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, కృష్ణాయపాలెంలో ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. మందడంలో అమరావతి పరిరక్ష కోసం మణిద్వీప వర్ణన పూజా కార్యక్రమం నిర్వహించారు. 3 గంటల పాటు మహిళలు సామూహిక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నన్నపనేని రాజకుమారి, గద్దె అనురాధ హాజరయ్యారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు