amaravati farmers padayatra: అమరావతి రైతుల మహా పాదయాత్ర 31వ రోజు అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకుల మధ్య సాగింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వంట వండుకునేందుకు, బస చేసేందుకు చిన్న చోటు కూడా దొరకలేదు. సాయం చేద్దామని ముందుకొచ్చిన వారు కూడా.. వైకాపా నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సొంతూరు తోడేరు సమీపంలో రోడ్డుపైనే అన్నం తిన్న రైతులు, మహిళలు.. న్యాయం కోసం గొంతెత్తితే ఇబ్బంది పెట్టడం సరికాదంటూ కన్నీరుమున్నీరయ్యారు.
ఏడుస్తూ భోజనాలు...
amaravati padayatra in Nellore : పొదలకూరు సమీపంలోని వేబ్రిడ్జ్ దగ్గర భోజన ఏర్పాట్లు చేసుకున్న రైతులను కాటా నిర్వాహకులు తొలుత అనుమతించారు. చివరి నిమిషంలో మాట మార్చారు. చేసేది లేక ఓ రైతుకు చెందిన నివేశన స్థలంలో అన్నం వండుకున్నా అక్కడ తగినంత స్థలం లేక చాటగొట్ల వద్ద రోడ్డుపైన కూర్చొని మహిళలు భోజనం చేశారు. వాహనాల దుమ్ము, మురుగు వాసన మధ్య తింటున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నారు. అమరావతి రైతుల యాత్ర భగ్నానికి కొందరు ప్రయత్నిస్తుంటే ప్రజలు మాత్రం ఘనస్వాగతం పలుకుతున్నారని ఐకాస నేతలు అన్నారు. తమను అడ్డుకోవడంపై పెట్టే శ్రద్ధ ప్రజలపై పెడితే బాగుంటుందని అధికార పార్టీకి సూచించారు.
ప్రచార రథాలను అడ్డుకోవటంపై రైతుల ఆగ్రహం
amaravati padayatra latest news : అమరావతి రాజధాని అందరిదని, ప్రచార రథాలను అడ్డుకోవడం సరికాదంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసనతో తిరుపతి నుంచి విజయవాడ వైపు వెళ్లే రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు గంటకు పైగా రైతుల ఆందోళన కొనసాగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రచార రథాలకు న్యాయస్థానం అనుమతి లేదంటూ పోలీసులు వాదించగా.. మద్దతు తెలిపే వారిని అడ్డుకోవాలని కోర్టు చెప్పలేదంటూ పరస్పరం వాదించుకున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.
25 కిలోమీటర్లు వెనక్కి వెళ్లి బస...
amaravati padayatra 2021 : సర్వేపల్లి నియోజకవర్గం మర్రిపల్లి వద్ద బుధవారం సాయంత్రం పాదయాత్ర ముగియగా... బస చేసేందుకు స్థలం దొరకలేదు. ఈ పరిస్థితుల్లో ఆటోలు, ట్రాక్టర్లు, బస్సుల్లో దాదాపు 25 కిలోమీటర్లు వెనక్కి వెళ్లి... 4 రోజులుగా ఆశ్రయమిస్తున్న శాలివాహన కల్యాణ మండపంలోనే బస చేశారు. నేడు అక్కడి నుంచి మళ్లీ వాహనాల్లో మర్రిపల్లి వచ్చి యాత్ర కొనసాగించనున్నారు. అమరావతి పాదయాత్రలో మహిళల కోసం ఏర్పాటుచేసిన బయో టాయిలెట్లు పోలీసులు తొలగించడాన్ని.. భాజపా ఎంపీ సి.ఎం.రమేష్ తప్పుబట్టారు. బయో టాయిలెట్లు లేకుంటే ఎక్కడికి వెళ్ళాలన్న మహిళల ప్రశ్నలకు ఈ ప్రభుత్వం బదులివ్వగలదా అంటూ ట్వీట్ చేశారు.