ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆందోళనల్లో అరెస్టై బెయిల్‌పై విడుదలైన మందడం రైతులకు రాజధాని గ్రామాల్లో ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. బైక్ ర్యాలీలతో సంఘీభావం ప్రకటించిన స్థానికులు, పూలవర్షం కురిపించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దిష్టిబొమ్మలు తగలబెట్టి ప్రభుత్వం వైఖరిని నిరసించారు.
అదొక బోగస్ కమిటీ..!
ప్రభుత్వ ప్రతినిధులు తప్ప ఇతరులకు చోటులేని కమిటీల వల్ల తమకు న్యాయం జరిగేదెలా అని అమరావతి ఆందోళనల సందర్భంగా రైతులు ప్రశ్నించారు. హై పవర్ కమిటీ బోగస్ కమిటీ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 3 రాజధానుల ప్రకటన ఉపసంహరణ తప్ప తమకు మరేదీ ఆమోదయోగ్యం కాదని రైతులు స్పష్టం చేశారు.
ముఖం చాటేసిన నేతలే పెయిడ్ ఆర్టిస్టులు
ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు ముఖంచాటేశారని రైతులు ఆక్షేపించారు. రైతుల సమస్య పట్ల స్పందింకపోగా తమని పెయిడ్ ఆర్టిస్టులని అవమానిస్తున్నారని ఆవేదన చెందారు. ఎన్నికల ముందు ఓట్లు కోసం వచ్చిన నేతలే పెయిడ్ ఆర్టిస్టులని ఆరోపించారు.
కొనసాగుతున్న దీక్షలు
పద్నాలుగో రోజైన ఇవాళ కూడా రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగనున్నాయి. మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు, వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. ఎర్రబాలెం, నీరుకొండ, కృష్ణాయపాలెం, నవులూరు సహా పలు గ్రామాల ప్రజలు నిరసనలలో పాల్గొననున్నారు. సచివాలయం ఉన్న మందడం వద్ద భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.