TS Intermediate Recounting :ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోంది. కరోనా ప్రభావం, సరైన ఆన్‌లైన్ బోధన లేకపోవడం వంటి కారణాల వల్ల... సగానికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారు. ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంటర్ బోర్డు నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం తెప్పించుకుంది.
రెండు లక్షల మంది ఎదురుచూపు..
పరీక్షలు నిర్వహించడం సరైన నిర్ణయమే అయినప్పటికీ.. వివిధ కారణాల వల్ల గ్రామీణ, గురుకుల విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారని ఇంటర్ బోర్డు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కనీస మార్కులతో ఉత్తీర్ణులను చేయడం, గ్రేస్ మార్కులు కలపడం, మరో ప్రత్యేక పరీక్ష నిర్వహించడం వంటివి ఇంటర్ బోర్డు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయం కోసం ఫెయిలైన సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
43 వేలకు పైగా దరఖాస్తులు..
రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌పై విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. జవాబు పత్రాల పునఃపరిశీలన, మార్కులు తిరిగి లెక్కించేందుకు.. వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటితో గడువు ముగిసింది. రీ వెరిఫికేషన్ కోసం సుమారు 39 వేల మంది.. రీకౌంటింగ్ కోసం దాదాపు 4 వేలకుపైగా మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశలు పెట్టుకున్న ఫెయిలైన విద్యార్థులు.. చివరి రోజు వరకు వేచి చూసి బుధవారం సాయంత్రం తర్వాత భారీగా దరఖాస్తు చేసుకున్నారు. నిన్న ఒక్క రోజే సుమారు 15వేల దరఖాస్తులు అందాయి. సాధారణంగా ప్రతీ ఏడాది సుమారు 20 వేల మంది దరఖాస్తు చేసుకుంటుండగా.. ఈ ఏడాది రెండింతలకుపైగా పెరిగాయి. ఈఏడాది ప్రభుత్వం రీవెరిఫికేషన్ రుసుమును 600 రూపాయల నుంచి 300 రూపాయలకు తగ్గించింది.
ఇదీచూడండి: