Promotions in Irrigation Department : నీటిపారుదల శాఖలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు(ఏఈఈ)గా పనిచేస్తున్న 140 మందికి ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు(డీఈఈ)గా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు గత నెల 30వ తేదీన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అయితే ఈ విషయాన్ని సంబంధిత శాఖ వెబ్‌సైట్‌లో ఎక్కడా పొందుపర్చలేదు. పైగా ప్రొసీడింగ్స్ నంబరు ఆర్‌సీ/ఈఎన్‌సీ/బీ3/19121924/2020 పేరున రూపొందించిన అంతర్గత ఉత్తర్వుల ప్రతిని ఇంజినీర్లకు వ్యక్తిగతంగా అందజేయడం గమనార్హం. గతంలో పదోన్నతులు కల్పించినప్పుడు అందరికీ కలిపి ఓ ప్రొసీడింగ్ కాపీ విడుదల చేసేవారు. పారదర్శకత కోసం వెబ్‌సైట్‌లో పొందుపర్చేవారు.
Promotions in Telangana Irrigation Department : తాజా పదోన్నతుల్లో ఏ జిల్లాలో ఎవరికి పదోన్నతులు లభించాయి? ఎక్కడ పోస్టింగ్‌లు కల్పించారనే వివరాలు, ఏ పద్ధతిలో ప్రక్రియను పూర్తిచేశారనే వివరాలు అందరికీ అందుబాటులో లేవని ఇంజినీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మార్గదర్శకాలపై స్పష్టత లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ఉత్తర్వులు-2018ని అనుసరించి జోనల్, బహుళ జోన్ల కేటాయింపులకు సంబంధించిన వివరాలేవీ వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవని ఇంజినీర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
పదోన్నతి కల్పించినా అక్కడే పోస్టింగ్‌లు
AEEs Promoted as DEEs in telangana : నీటిపారుదల శాఖలో డీఈఈలుగా పదోన్నతి పొందిన కొంత మందిని వేరే ప్రాంతాలకు బదిలీ చేశారు. కొద్ది మందికి మాత్రం ఏఈఈలుగా సుదీర్ఘకాలం కొనసాగిన ప్రాంతాల్లోనే డీఈఈలుగా బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రాల్లో ఏళ్లతరబడి పనిచేస్తున్న వారిని తిరిగి అదే ప్రాంతంలో పోస్టింగ్‌లు కల్పించడం చర్చకు దారితీస్తోంది. హైదరాబాద్‌తో పాటు పలు ఉమ్మడి జిల్లాల్లో ఇదే పద్ధతిలో పోస్టింగ్‌లు ఇచ్చారు. ఏఈఈల కొరత ఉండటంతో పదోన్నతుల అనంతరం తిరిగి అక్కడే పోస్టింగ్ ఇచ్చి పాత విధుల బాధ్యతలు అప్పగిస్తున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.