సివిల్ సర్వీసెస్ పరీక్షార్థుల సన్నద్ధత మార్చి 15 వరకూ అంతా సజావుగానే సాగింది. క్రమంగా.. కోచింగ్ కేంద్రాలూ, రీడింగ్ రూములూ మూతబడి హాస్టళ్లు ఖాళీ చేయాల్సివచ్చింది. దేశవ్యాప్త లాక్‌డౌన్ ఫలితంగా పరీక్షలు వాయిదాపడటంతో భౌతికంగా, మానసికంగా అభ్యర్థులు పరీక్ష ప్రిపరేషన్‌కు దూరం కావాల్సివచ్చింది. లాక్‌డౌన్ కొనసాగుతుండగా సోషల్‌మీడియాలో వదంతుల హోరు పెరిగింది. ఈ ఏడాది సివిల్స్ పరీక్ష జరగకపోవచ్చనే ప్రచారాలు నమ్మి చాలామంది సన్నద్ధతను ఆపేశారు కూడా. ఇప్పుడు పరీక్ష తేదీ ప్రకటనతో వదంతులకు తెరపడి అభ్యర్థుల సందిగ్ధత సమసిపోయింది.
ప్రిలిమినరీ పరీక్షకు మిగిలున్న 115 రోజుల సమయం.. మెరుగ్గా తయారయ్యేందుకు తగిన వ్యవధే! ఇంత విరామం తర్వాత సన్నద్ధత ఆరంభించి, దానిలో పూర్తిగా నిమగ్నం కావటానికి పరీక్షార్థులందరూ మానసికంగా సిద్ధపడాలి.
నమూనా పరీక్ష రాయాలి
వెంటనే ఏదో ఒక సబ్జెక్టుతో ప్రిపరేషన్‌ను ఆరంభించేస్తే సరిపోతుందా? లేదు. మొదట ఒక నమూనా ప్రిలిమినరీ ప్రశ్నపత్రాన్ని పరీక్షా పద్ధతుల్లో రాయాలి. మార్కులు ఎలా వచ్చాయో చెక్ చేసుకోవాలి. దాదాపు 55 శాతం మార్కులు స్కోరు చేయాలని గుర్తుంచుకోవాలి. అంతకంటే తక్కువ మార్కులు వస్తే కింది ప్రశ్నలు వేసుకోండి
- ఏ సబ్జెక్టు అంశాల్లో సరిగా జవాబులు రాయలేకపోయాను? ఎందుకని?
- ‘గెస్’ చేయకుండా ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశాను?
- ఊహించి రాసినవి ఎన్ని తప్పయ్యాయి? ఆధారం లేని ఊహలతో అనవసరంగా మరీ ఎక్కువ ప్రశ్నలకు జవాబులు ఇచ్చానా?
వీటిని సమీక్షించుకుని సన్నద్ధతలో తగిన మార్పులు చేసుకోవాలి. ఆ అంశాల్లో పరిజ్ఞానం పెంచుకోవాలి.
సన్నద్ధత ఎలా ఉంది?
ఏ విభాగాలపై పట్టు ఉందో, వేటిపై సరిగా సిద్ధం కాలేదో ఓ కాగితమ్మీద రాసుకోవాలి. సరిగా చదవని అంశాలను పూర్తిచేయటమూ, పట్టు ఉన్న అంశాలను పునశ్చరణ చేయటమూ వచ్చే 30 రోజుల్లో పూర్తిచేయాలి.
మెయిన్‌తో లంకె:
ప్రిలిమినరీకి ఇప్పుడు తగినంత సమయం ఉంది కదా? అందుకే మెయిన్స్ ప్రిపరేషన్‌ను ప్రిలిమినరీతో అనుసంధానం చేయాలి. ఎథిక్స్, ఆప్షనల్ తప్ప మిగతావాటిలో ఉమ్మడి అంశాలు ఎక్కువ. మొదట చెప్పిన నమూనా పరీక్ష బాగా రాసినవారు కూడా ఆప్షనల్ ప్రిపరేషన్ మొదలుపెట్టవచ్చు. అయితే ఆప్షనల్ చదవటం నెలరోజుల్లోపు ముగించి జనరల్ స్టడీస్ అంశాలపై దృష్టి పెంచాలి.
సబ్జెక్టులవారీగా..:
ఇప్పటి నుంచి 30 రోజుల్లో సబ్జెక్టులవారీ పరీక్షలు రాయటం మేలు. ఒక సబ్జెక్టులో అన్ని విభాగాలూ కవర్ అయ్యాయో లేదో దీనివల్ల తెలుస్తుంది. సన్నద్ధతతో పాటు ఏకకాలంలో ఇది సాగాలి.
వర్తమాన అంశాలు:
మీరు వర్తమాన అంశాలను మార్చి వరకూ కవర్ చేసివుంటారు. పాత షెడ్యూల్ ప్రకారమైతే ఏప్రిల్ 1 వరకూ చూసుకుంటే సరిపోయేది. ఇప్పుడైతే సెప్టెంబరు వరకూ వర్తమాన అంశాల అధ్యయనం పొడిగించుకోవాల్సివుంటుంది. సెప్టెంబరు 2019 నుంచి మొదలుపెట్టి కరెంట్ అఫైర్స్‌ను ఎక్కడ ఆపేశారో అక్కణ్నుంచి అనుసరిస్తుండాలి.
సమగ్ర పరీక్షలు:
30 రోజుల్లో సబ్జెక్టువారీ టెస్టులు పూర్తిచేశాక.. సమగ్ర (కాంప్రహెన్సివ్) పరీక్షలను రాయటం ఆరంభించాలి. ఇప్పుడు జవాబుల కచ్చితత్వంపై దృష్టిపెట్టాలి. తెలియని ప్రశ్నలకు ఊహించి రాయవద్దు. తెలియని టాపిక్‌లను సంపూర్ణంగా చదివి, సంబంధిత సమాచారాన్ని పుస్తకంలో రాసుకోవాలి. ఇలా 30 రోజులు చేయాలి.
ప్రాక్టీస్ పరీక్షలు:
తర్వాత 30 రోజులూ.. ప్రిలిమినరీ పరీక్ష రాస్తున్నట్టుగా భావించి అవే పరిస్థితుల్లో ప్రాక్టీస్ టెస్టులను రాయాలి. వీటిలో గెసింగ్ చేయవచ్చు. ఊహించి రాసినవి ఎన్ని సరైనవో, ఎన్ని తప్పయ్యాయో గమనించుకోవాలి. క్రమంగా తప్పు సమాధానాలను తగ్గించే ప్రయత్నం చేయాలి. పరీక్షలో ఊహించి రాయాల్సిన పరిస్థితిని అంగీకరించి, సరిగ్గా ఊహించటంలో ఆరితేరాలి.
లక్ష్యం 55 శాతం: ప్రతి టెస్టులోనూ కనీసం 55 శాతం మార్కులు తెచ్చుకునేలా కృషి చేయాలి. ప్రతి పరీక్షలోనూ అధిక మార్కుల సాధన లక్ష్యంగా పెట్టుకోవాలి. పూర్తి స్థాయి మాక్‌టెస్టుల్లో వస్తున్న మార్కుల తీరును పరిశీలించుకుని, లోటుపాట్లు సరిదిద్దుకోవాలి. ఇలా చేస్తూపోతే నమూనా టెస్టులన్నిటిలో అత్యధిక స్కోరు తప్పకుండా సాధ్యమవుతుంది.
కొవిడ్‌పై ఏయే ప్రశ్నలు?
ప్రిలిమ్స్‌లో కొవిడ్-19పై ప్రశ్నలు వస్తాయని ఊహించటం సహజం. ఇది సివిల్ సర్వీసెస్ పరీక్షకే కాకుండా ఇతర పోటీ పరీక్షలకూ వర్తిస్తుంది. అన్ని ప్రశ్నలూ కరోనా సంబంధిత అంశాలపై ఉండవు గానీ కొన్ని మాత్రం వస్తాయి. వాటిపై మెరుగ్గా తయారైవుండటం మేలు.
సమయం సరిపోతుందా?
* ప్రిలిమినరీకి ఏమంత ప్రిపేర్ కాలేదు. మేలో పరీక్షకు హాజరు కాకపోవటమే మంచిదనుకుంటున్నా. ఇప్పుడున్న వ్యవధి పరీక్ష రాయటానికి సరిపోతుందా?
- నిశ్చయంగా సరిపోతుంది. ఇప్పుడు దొరికిన సమయాన్ని అవకాశంగా భావించి సరిగా సిద్ధమైతే పరీక్ష మెరుగ్గా రాయగలగటం సాధ్యమే.
* మొన్నటిదాకా కంబైన్డ్ స్టడీ చేశాను. ఇప్పుడున్న లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఒంటరిగా చదవలేకపోతున్నా. ఏం చేయాలి?
- విజయవంతంగా పరీక్ష నెగ్గి సివిల్ సర్వీస్ పొందినవారిని గమనిస్తే.. కంబైన్డ్ స్టడీ చేసినవారి కంటే సెల్ఫ్‌స్టడీ చేసినవారే ఎక్కువమంది కనిపిస్తారు. విడిగా చదవటం అలవాటయ్యేవరకూ మీ సహాధ్యాయులతో టెక్నాలజీ సాయంతో అనుసంధానమవుతూ అవసరమైన ప్రేరణ పొందవచ్చు.
* వాయిదా పడిన పరీక్ష కదా? ప్రశ్నపత్రాన్ని మళ్లీ తయారుచేస్తారా?
- అవును. అయితే ప్రిలిమ్స్ వివిధ విభాగాల్లోని మౌలిక ప్రశ్నలు మారవు. కానీ ప్రతి సబ్జెక్టులోనూ ఉండే వర్తమాన అంశాల భాగం మాత్రం మారుతుంది.
* ఏ నెల వరకూ వర్తమాన అంశాలను చదవాలి?
- సెప్టెంబరు 1, 2020 వరకూ వర్తమాన అంశాలను చదవాల్సివుంటుంది.
ఇవీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!