మేడారం చిన జాతరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జంపన్నవాగులో స్నానాలు చేసిన భక్తులు భక్తిశ్రద్ధలతో వనదేవతలను దర్శించుకుంటున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేటితో చిన జాతర ముగియనుంది.
మాఘ శుద్ధ పౌర్ణమి మరుసటి రోజు బుధవారం నుంచి భక్తుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు దూర ప్రాంతాలనుంచి మేడారానికి విచ్చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలలో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ల సన్నిధికి వస్తున్నారు. జంపన్నవాగు వద్ద స్నానాలు చేసి.. తలనీలాలు సమర్పించి....గద్దెల వైపు సాగుతున్నారు. వరాలిచ్చే వనదేవతలను దర్శించుకుని పరవశులౌతున్నారు.
అమ్మవార్ల సన్నిధికి శివశక్తులూ పోటెత్తుతున్నారు. నృత్యాలు చేస్తూ....తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మళ్లీ పెద్ద జాతరకు వస్తామంటూ.....దేవతలకు ప్రణమిల్లి....ఇంటి బాట పడుతున్నారు. నేటితో జాతర ముగిసినా.. రేపు ఆదివారం కావటంతో ఎక్కువమంది భక్తులు మేడారానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి:పెద్దగట్టుకు వేళాయే..!