Crop Damage in Telangana : అధిక వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులు ఇంకో పంట ఎలా వేయాలని ఆందోళన చెందుతున్నారు. పలు ప్రాంతాల్లో పైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో పంటలు వేయడానికి ఇంకా గడువు ఉందని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శుక్రవారం రైతులకు సూచనలు జారీచేసింది. పత్తి పంటను ఈ నెల 20 వరకు, సజ్జలు, కొర్రలు, ఆముదం వంటి పంటలను ఈ నెలాఖరు వరకూ విత్తుకోవచ్చని తెలిపింది. రాష్ట్రంలో వరినాట్లు వచ్చే నెలాఖరుదాకా వేయడం ఆనవాయితీ. కానీ గతంలో సాగుచేసిన పత్తి వరదలకు కొట్టుకుపోయిన రైతులు మళ్లీ విత్తనాలు వేయడానికి పెట్టుబడులకు సొమ్ముల్లేక ఆందోళన చెందుతున్నారు.
పంట నష్టాలపై వ్యవసాయశాఖ అధికారికంగా అంచనాలు వెల్లడించకపోయినా 10 లక్షల ఎకరాలకు పైగా నీటమునిగినట్లు జిల్లా యంత్రాంగాల ప్రాథమిక అంచనా. ఎకరానికి కనిష్ఠంగా రూ.5 వేల విలువైన పంట దెబ్బతిన్నా రూ.500 కోట్లకు పైగా రైతులు నష్టపోయినట్టేనని సీనియర్ అధికారి చెప్పారు. వాస్తవానికి రైతులకు వాటిల్లిన నష్టం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు.
ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో పడకల్ పెద్దచెరువు తెగి 150 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. గోదావరి పరీవాహక తాల్లో పంటలన్నీ మూడురోజులుగా బురదనీటిలోనే ఉన్నాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే లక్షా 3 వేల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని, వీటితో రైతులు కోల్పోయిన సొమ్ము విలువ రూ.72.85 కోట్ల వరకూ ఉంటుందని జిల్లా అధికారులు అంచనా వేశారు. నిర్మల్ జిల్లాలో లక్షా 4 వేలు, మంచిర్యాలలో 63 వేలు, కుమురం భీంలో 50 వేలు, ఉమ్మడి కరీంనగర్‌లో 35 వేలు, నిజామాబాద్‌లో 50 వేలు, జయశంకర్ జిల్లాలో 13,810 ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు అధికారులు గుర్తించారు.
ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉందా... ప్రతీ పంట సీజన్‌లో సాధారణ పంటల సాగుకు ప్రణాళికతో పాటు, విపత్తులొచ్చి రైతులు నష్టపోతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కూడా జిల్లావారీగా వ్యవసాయశాఖ సిద్ధంగా ఉంచాలి. కానీ ఈ విషయంలో ఇప్పటివరకూ అధికారికంగా రైతులకు ఏమీ చెప్పలేదు. సాయం విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదు. రైతులు మరో పంట సాగుచేయాలనుకుంటే విత్తనాలు అందించడానికి అవకాశముందా అని జయశంకర్ వర్సిటీని, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను ప్రభుత్వం తాజాగా ఆరాతీసింది. వరి, కంది, ఆముదం వంటి పంటల విత్తనాలున్నట్లు అవి సమాచారమిచ్చాయి. కానీ పత్తి పంట మళ్లీ వేయాలంటే ప్రైవేటు కంపెనీల నుంచే రైతులు కొనాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు ఉచితంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని రైతుసంఘాలు డిమాండు చేస్తున్నాయి.
వరిపైరు దున్నేసి స్వల్పకాలిక రకాలు వేయాలి... వరిపైరు వరదలో మునిగి దెబ్బతిన్న పొలాన్ని దున్ని దమ్ము చేసి మళ్లీ స్వల్పకాలిక వరి వంగడాలను నేరుగా విత్తుకోవాలని రైతులకు జయశంకర్ వర్సిటీ సూచించింది. ‘రైతులు ఇక నేరుగా విత్తుకోవాలి. మొక్కజొన్న, సోయా, పత్తి మొక్కలు లేత దశలో ఉన్నందున నిల్వ ఉన్న నీరు బయటికి పోయేలా చూడాలి. పత్తి త్వరగా కోలుకోవడానికి ఫాలిఫిడ్ (19:19:19) లేదా మల్టీ-కె (13:0:45) ఎరువు వేయాలి’ అని వర్సిటీ పరిశోధన సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ సూచించారు.