Twitter Spam Accounts : ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత సంస్థాగత సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ కొనుగోలుకు ముందే స్పామ్ ఖాతాలను ప్రక్షాళన చేస్తామన్న మస్క్.. ఆ పని జరుగుతోందని వెల్లడించారు.
ట్విట్టర్‌లో స్పామ్ ఖాతాల ప్రక్షాళన జరుగుతోందని.. దీని వల్ల ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని మస్క్ ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లో మీ ఖాతాలకు ఫాలోవర్ల సంఖ్య తగ్గినట్లు మీరు గమనిస్తే చింతించవద్దని ఆయన వెల్లడించారు. ట్విట్టర్ నూతన సంస్కరణను చేపట్టామన్న మస్క్.. దీనివల్ల ట్విటర్ మరింత పారదర్శంగా మారుతుందని తెలిపారు.
ట్విట్టర్‌లో ట్వీట్ చేయడానికి అక్షరాల పరిమితిని కూడా 280 నుంచి 1000కు పెంచాలని ఎలాన్ మస్క్ యోచిస్తున్నారు. ఇటీవల ట్విట్టర్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందించిన మస్క్.. అక్షరాల పరిమితిని వెయ్యికి పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ట్విట్టర్.. ఇతర సోషల్ మీడియాల మధ్య ప్రధాన వ్యత్యాసాలలో అక్షరాల పరిమితి కూడా ఒకటని మస్క్ వెల్లడించారు. తొలుత ఈ పరిమితిని 280 నుంచి 420కు పెంచాలని తన టీమ్‌కు సూచించిన మస్క్.. క్రమంగా దానిని వెయ్యికి పెంచాలని నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో వేచి చూడాలి.
40 వేల ఖాతాలు బ్యాన్..
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబరు 25 మధ్య భారతదేశంలో పిల్లల లైంగిక దోపిడీని ప్రోత్సహిస్తున్న 44,611 ఖాతాలను ట్విట్టర్ బ్యాన్ చేసింది. అంతకుముందు ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 25 మధ్య 50 వేలకుపైగా ఖాతాలను నిషేధించింది.