Twitter three colours : సోషల్ మీడియా మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్‌ఫాం ట్విటర్‌లో.. అకౌంట్ వెరిఫికేషన్ ప్రక్రియ తిరిగి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటిదాకా బ్లూ కలర్లో ఉన్న వెరిఫికేషన్ మార్క్ ఇప్పుడు మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుందని ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ పేర్కొన్నారు. సెలబ్రిటీలు/వ్యక్తిగత ఖాతాలకు బ్లూ టిక్, ప్రభుత్వ అకౌంట్లకు గ్రే టిక్, కంపెనీలకు గోల్డ్ కలర్ టిక్‌ను కేటాయించనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు.
కాగా, ట్విట్టర్లో ప్రస్తుతం ఉన్న అక్షరాల నిడివి 280 నుంచి 4 వేలకు పెంచుతున్నట్లు మస్క్ ధ్రువీకరించారు. "ట్విట్టర్లో అక్షరాల నిడివి పెంచుతున్న విషయం నిజమేనా? అని ట్విట్టర్ వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు మస్క్ 'అవును' అని బదులిచ్చారు. అయితే, అది ఎప్పుడు మార్చుతారన్నదానిపై మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు.
ట్విటర్ 'సేఫ్టీ కౌన్సిల్' రద్దు
ట్విటర్ అధిపతి ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ సంస్థలో 'ట్రస్ట్ అండ్ సేఫ్టీ కౌన్సిల్'ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్వేష ప్రసంగాలు, బాలలపై ఆకృత్యాలు, ఆత్మహత్యలు, స్వీయ హాని సహా ఇతర సమస్యలను ట్విటర్‌లో సమర్థంగా ఎదుర్కొనేందుకు 2016లో అప్పటి యాజమాన్యం ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. దీంట్లో 100 మంది స్వతంత్ర సభ్యులు ఉండేవారు. పలు పౌర, మానవతా సంస్థలకు చెందిన వ్యక్తులు తమ సేవల్ని అందించేవారు.
సోమవారం రాత్రి ఈ కౌన్సిల్ సమావేశం కావాల్సి ఉంది. కానీ, కొన్ని గంటల ముందు పూర్తిగా కౌన్సిల్‌నే రద్దు చేస్తున్నట్లు మస్క్ బృందం సభ్యులకు మెయిల్ పంపింది. ఈ కౌన్సిల్ ఇప్పటి వరకు ఒక స్వతంత్ర బృందంగా వ్యవహరిస్తూ వచ్చింది. హింస, ద్వేషం సహా ఇతర సమస్యల్ని ఎదుర్కోవడానికి కావాల్సిన సలహాలు, సూచనలను ట్విటర్‌కు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండేది. కానీ, నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం ఉండేది కాదు. అలాగే ప్రత్యేకమైన సమస్యల్ని సమీక్షించిన దాఖలాలూ లేవు.