ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతుంటే టీవీలకు అతుక్కుపోని వారు అంటూ ఎవరూ ఉండరు. ఐపీఎల్ మ్యాచ్‌లు, ప్రపంచ కప్‌లు, ఒలింపిక్స్ క్రీడలు సరేసరి. భారత్‌లో క్రీడలపై ఉన్న మమకారమే.. టీవీ క్రీడల మార్కెట్‌కు దన్నుగా నిలబడుతోంది. 2025-26 కల్లా ఈ మార్కెట్ రూ.9,830 కోట్లకు చేరొచ్చని సీసీఐ, కేపీఎమ్‌జీ, ఇండియా బ్రాడ్‌క్యాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్(ఐబీడీఎఫ్) సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదిక అంచనా వేస్తోంది. ఈ నివేదిక ప్రకారం..
- భారత్‌లో క్రీడల వీక్షణ విషయంలో క్రికెట్‌దే ఆధిపత్యం. ఐపీఎల్ మ్యాచ్‌లు అత్యంత ప్రభావం చూపుతున్నాయి. కబడ్డీ, ఫుట్‌బాల్, ఖోఖో వంటి ఫ్రాంఛైజీ క్రీడలపైనా ఆసక్తి పెరిగింది.
- 2022 తొలి తొమ్మిది నెలల్లో భారత్‌లో క్రీడల వీక్షకులు 72.2 కోట్లకు చేరుకున్నారు. కరోనాకు ముందు నమోదైన 77.6 కోట్ల రికార్డును ఈ ఏడాది బద్దలుకావొచ్చు.
- క్రీడలకు డిజిటల్ ఆదాయాలు ఏటా 22 శాతం సమ్మిళిత వృద్ధి రేటును సాధిస్తున్నాయి. 2025-26కల్లా ఇవి మూడింతలై రూ.4,360 కోట్లకు చేరవచ్చు. డిజిటల్‌పై వ్యాపార ప్రకటనదార్లకు ఉన్న బలమైన ఆసక్తి వల్ల డిజిటల్ ప్లాట్‌ఫాంల నుంచి వ్యాపార ప్రకటనల ఆదాయాలు పెరుగుతున్నాయి.
- ఎక్కడైనా చూసే సౌకర్యం ఉండడంతో ఓటీటీ వీక్షకుల సంఖ్యలోనూ వృద్ధి కొనసాగనుంది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు పెరుగుతుండడంతో క్రీడలకూ ఆ సబ్‌స్క్రిప్షన్ ఆదాయాలు పెరగనున్నాయి. సబ్‌స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్(ఎస్‌వీఓడీ) దిశగా ఓటీటీ ప్లాట్‌ఫారాలు వెళుతుండడం కూడా కలిసొచ్చే అంశం.
టీవీకి కొనసాగనున్న ఆదరణ..
గత కొన్నేళ్లుగా డిజిటల్ వినియోగంలో వేగవంతమైన వృద్ధి ఉన్నప్పటికీ.. టీవీ స్పోర్ట్స్ మార్కెట్ మొత్తం డిజిటల్ స్పోర్ట్స్ మార్కెట్ కంటే రెండింతలు పెరగవచ్చు. సమీప భవిష్యత్‌లోనూ స్పోర్ట్స్ చూడడానికి టీవీ, సంప్రదాయ ప్లాట్‌ఫారాలు తమ హవాను కొనసాగించొచ్చు. 2020-21లో టీవీ క్రీడల మార్కెట్ రూ.7050 కోట్లుగా నమోదైనట్లు అంచనా. ఇది 7 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 2025-26 కల్లా రూ.9,830 కోట్లకు చేరుతుందని అంచనా. 2020 నాటికి 21 కోట్ల ఇళ్లకు చేరింది. అంటే 90 కోట్ల మంది టీవీని చూస్తున్నారు. అయినప్పటికీ టీవీలో క్రీడలు చూసే వారి సంఖ్య తక్కువగానే ఉన్నందున భారీ వృద్ధికి అవకాశాలున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మొత్తం టీవీ వీక్షణలో క్రీడల వాటా 3 శాతంగానే ఉంది. అమెరికాలో ఇది 10 శాతంగా ఉంది. ఈ అంతరం రాబోయే ఏళ్లలో తగ్గవచ్చు.
లైవ్ క్రికెట్‌కు సంబంధించి 2022లో 44వ వారం వరకు 16,217 గంటలు నమోదయ్యాయి. 2021 మొత్తం మీద నమోదైన 15,506 గంటలను ఇది ఇపుడే అధిగమించింది. కంటెంట్ పరిమాణం, వ్యాప్తి విషయంలో క్రికెట్‌కు దరిదాపుల్లో ఏ క్రీడలూ లేవు. అయితే కొన్ని క్రికెటేతర లీగ్‌లకూ ఆదరణ దక్కుతోంది. 2022లో ఇప్పటిదాకా క్రికెటేతర క్రీడల వీక్షణ 20 శాతానికి చేరుకుంది.