Tips For Handling Insurance Claims : బీమా పాలసీలు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మన కుటుంబాన్ని ఆదుకుంటాయి. ముఖ్యంగా ఆర్జించే వ్యక్తి దురదృష్టకరమైన పరిస్థితుల్లో మరణిస్తే.. అతని కుటుంబానికి జీవిత బీమా ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అయితే ఇన్సూరెన్స్ పాలసీ అనేది పెట్టుబడి పథకం కాదు అనే విషయాన్ని మీరు కచ్చితంగా గుర్తించుకోవాలి.
పొరపాట్లు చేయవద్దు!
బీమా పాలసీని తీసుకునేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. ఒక వేళ చిన్న పొరపాటు చేసినా.. క్లెయిం పొందడం చాలా కష్టమైపోతుంది. అందుకే పాలసీదారులు ప్రతి విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి బీమా అనేది పరస్పర నమ్మకంపై కుదిరే ఒక ఒప్పందం. పాలసీదారుడు మరణించిన సందర్భంలో పాలసీ విలువ మేరకు పరిహారం ఇస్తామనే వాగ్దానంతో బీమా సంస్థ పాలసీని విక్రయిస్తుంది. అందుకే మీరు అన్ని విషయాలను కచ్చితంగా తెలియజేయాలి. అప్పుడే పాలసీ క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉంటుంది.
నామినీని ఏర్పాటు చేసుకోవాలి!
జీవిత బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు, నామినీ పరిహారాన్ని క్లెయిం చేసుకోవడానికి వీలవుతుంది. అందుకే పాలసీ తీసుకున్నప్పుడు నామినీని జత చేయాలి. అవసరమైతే నామినీని మార్చుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. నామినీ లేకపోతే ఆ పాలసీ నుంచి పరిహారం పొందడం చాలా కష్టమైపోతుంది.
కుటుంబ సభ్యులకు/ నామినీకి పాలసీ గురించి చెప్పండి!
చాలా మంది బీమా పాలసీ తీసుకుంటారు. కానీ, దాని గురించి నామినీగా ఉన్న వ్యక్తికిగానీ, కుటుంబ సభ్యులకు గానీ తెలియజేయరు. ఇది పెద్ద పొరపాటు. జీవిత బీమా పాలసీ ఎక్కడ తీసుకున్నారు, ఎంత మొత్తానికి తీసుకున్నారు, అవసరమైనప్పుడు క్లెయిం ఎలా చేయాలి, ఎవరిని సంప్రదించాలి లాంటి అన్ని వివరాలనూ నామినీకి లేదా కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. అప్పుడే పాలసీదారుడికి అనుకోనిదేదైనా జరిగినప్పుడు వారు వెంటనే క్లెయిం దాఖలు చేయగలరు.
పాలసీ నిబంధనలన్నీ తెలుసుకోండి!
ఏదైనా బీమా పాలసీని కొనుగోలు చేసే ముందు పాలసీ పత్రాన్ని జాగ్రత్తగా చదవాలి. పాలసీలో పేర్కొన్న మినహాయింపులు, ఇతర నిబంధనలు, షరతులు అన్నీ అర్థం చేసుకోవాలి.
సకాలంలో ప్రీమియం చెల్లించాలి!
జీవిత బీమా పాలసీని తీసుకోవడమే కాదు.. సకాలంలో ప్రీమియంలను చెల్లించాలి. అప్పుడే పాలసీ సజావుగా అమల్లో ఉంటుంది. క్లెయిమ్ చేసుకోవడం సులువు అవుతుంది. లేకపోతే పాలసీ రద్దవుతుంది.
వీలైనంత త్వరగా..
పాలసీదారుడు మరణించినప్పుడు నామినీలు వీలైనంత త్వరగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. నిర్ణీత గడువు లోపే బీమా క్లెయింను దాఖలు చేయాలి. అప్పుడే బీమా కంపెనీలు పరిహారం చెల్లిస్తాయి. క్లెయిం ఆలస్యంగా దాఖలు చేస్తే బీమా సంస్థ దాన్ని తిరస్కరించే ప్రమాదం ఉంటుంది.
పత్రాలన్నీ సమర్పించాలి!
క్లెయింను దాఖలు చేసే నామినీలు.. బీమా కంపెనీలకు అన్ని పత్రాలను అందించాలి. ఒక వేళ ప్రమాదవశాత్తు పాలసీదారు మరణిస్తే.. అతని/ ఆమె మరణ ధ్రువీకరణ పత్రం, మరణానికి గల కారణాలు, అవసరమైన ఫొటోలు, పోలీసు నివేదికల లాంటి పత్రాలన్నీ జత చేయాలి. బీమా కంపెనీ అడిగిన పత్రాలను సమర్పించకపోతే బీమా క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంటుంది.
ఏ విషయాన్నీ దాచవద్దు!
పాలసీదారులు బీమా సంస్థ నుంచి పాలసీ తీసుకునేటప్పుడు ఎలాంటి వివరాలనూ దాచకూడదు. చాలా మంది తమకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి, చెడు అలవాట్లు (సిగరెట్, ఆల్కహాల్ తీసుకోవడం) గురించి తెలియజేయరు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే.. పాలసీదారులు తప్పుడు సమాచారం అందించినట్లు తేలితే.. క్లెయింను పరిష్కరించడానికి బీమా సంస్థ ఇష్టపడదు.
అందుకే కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించే విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. పాలసీ తీసుకునే సమయంలోనే పాలసీదారులు అన్ని నిబంధనలూ పాటిస్తే.. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బీమా లబ్ధి చేకూరుతుంది. సదరు పాలసీదారుని కుటుంబానికి భద్రత ఏర్పడుతుంది.
ఆధార్‌తో ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ లింక్ చేయవచ్చా?
రూ.10 లక్షల బడ్జెట్లో - బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న టాప్-5 కార్స్ ఇవే!