ప్రముఖ ఫుడ్ డెలివరి యాప్ స్విగ్గీ.. అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. అయితే ఈ సేవలు అందరికీ కాదని.. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అని వివరించింది. ఈ అంబులెన్సు డెలివరీ సిబ్బంది అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవచ్చని తెలిపింది. దీని కోసం ఓ టోల్ ఫ్రీ నంబర్, ఎస్ఓఎస్ బటన్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండింటిలో దేనిని సంప్రందించిన అంబులెన్స్ వారి వద్దకు వస్తుందని తెలిపింది. దేశంలోని గిగ్ ఎకానమీలో భాగమైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది డెలివరీ ఏజెంట్లు ఉన్నారని.. వీరి సామాజిక, ఆర్థిక భద్రత లేదని పేర్కొంది. అందుకోసమే వారికి సాయం చేసేందుకు ఈ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది.
కాగా, ఈ అంబులెన్సులు.. ఫోన్ చేసిన 12 నిమిషాల్లో వస్తాయని అని కంపెనీ పేర్కొంది. కేవలం ఒక ఐడీ నంబర్ చెబితే సరిపోతుందని తెలిపింది. 'ఈ సేవలను మొదటగా బెంగళూరు, ముంబయి, పుణె, కోల్‌కతా, దిల్లీ, ఎన్‌సీఆర్, హైదరాబాద్ నగరాల్లో అందుబాటులోకి వస్తాయి. సంస్థ అందిస్తున్న బీమా పాలసీలో ఉద్యోగి నమోదు చేసిన కుటుంబ సభ్యులకు పూర్తి ఉచితం అని చెప్పింది. ఒకవేళ బీమాలో నమోదు చేయకుండా, తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూడా డెలివరీ ఏజెంట్లు ఈ అంబులెన్స్ సేవలను ఉపయోగించుకోవచ్చు'' కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీకి వెళ్లిన స్విగ్గీ ఉద్యోగి ఒకరు కుక్క దాడి చేస్తుందనే భయంతో మూడో అంతస్తు నుంచి దూకాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన అతను చికిత్స పొందతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం స్విగ్గీ ఈ అంబులెన్స్ సేవలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.