Solution Oriented Mutual Funds : ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వాటిలో పిల్లల ఉన్నత చదువులు, పదవీ విరమణ ప్రణాళికలు కూడా ఉంటాయి. వీటికి కావాల్సిన నిధులు సంపాదించాలంటే, సరైన పెట్టుబడులు పెట్టాల్సిందే. అందుకే నేడు మ్యూచువల్ ఫండ్లలో పలు నూతన విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిని ఎలా ఎంపిక చేసుకోవాలి? వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సొల్యూషన్-ఓరియెంటెడ్ ఫండ్స్
మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) మ్యూచువల్ ఫండ్లలో ప్రత్యేకంగా కొన్ని విభాగాలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సొల్యూషన్-ఓరియెంటెడ్ ఫండ్స్ అని పిలుస్తారు. ఉద్యోగుల పదవీ విరమణ, పిల్లల ఉన్నత చదువులు సహా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, సెబీ ప్రస్తుతానికి ఈ రెండు రకాల సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.
దీర్ఘకాలిక పెట్టుబడులుగా!
సెబీ అందుబాటులోకి తెచ్చిన ఈ రెండు రకాల ఫండ్లకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
5 ఏళ్ల లాకిన్ పీరియడ్
ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులను కనీసం 5 సంవత్సరాలపాటు కొనసాగించాల్సి ఉంటుంది. పెట్టుబడి లక్ష్యాలను సాధించడానికి ఈ మాత్రం సమయం పడుతుంది. అందుకే ఇన్వెస్టర్లు మధ్యలోనే తమ పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా ఈ లాకిన్ పీరియడ్‌ను ఏర్పాటు చేశారు. ఇలా ఎక్కువ కాలం పెట్టుబడులు కొనసాగినప్పుడు నష్టాలు పరిమితమై, లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఈక్విటీ, డెట్ ఇన్వెస్ట్మెంట్ల కలయికతో ఈ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. పదవీ విరమణకు చాలా ఏళ్ల వ్యవధి ఉన్న వారు ఈక్విటీ పెట్టుబడులను ఎంచుకోవడం మంచిది. దీనివల్ల పెట్టుబడి వృద్ధికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నష్టభయం తక్కువగా ఉండాలని కోరుకునేవారు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడం మంచిది. పిల్లల ఉన్నత చదువుల కోసం మదుపు చేసేవారు, తమ అవసరాలకు అనుగుణంగా ఫండ్లను ఎంచుకోవాలి. రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటే, ఈక్విటీలపై దృష్టి కేంద్రీకరించవచ్చు.
పదవీ విరమణ కోసం
పదవీ విరమణ కోసం ప్రత్యేకించిన మ్యూచువల్ ఫండ్స్ ప్రధానంగా ఈక్విటీ, డెట్ విభాగాల్లో మదుపు చేస్తాయి. అయితే పదవీ విరమణ వయస్సు దగ్గరపడుతున్నప్పుడు, పెట్టుబడులను క్రమంగా ఈక్విటీల్లో తగ్గించుకుంటూ, డెట్ పథకాలకు ఎక్కువ శాతం మళ్లిస్తాయి. అస్థిరతను, నష్టభయాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. రిటైర్మెంట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు మదుపరులు దీర్ఘకాలంపాటు క్రమశిక్షణతో వాటిని కొనసాగించగలగాలి. దీనికోసం క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) పాటించాలి.
పిల్లల భవిత కోసం
నేటి కాలంలో విద్య అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. భవిష్యత్‌లో ఈ విద్య ఖర్చులు మరింత పెరగనున్నాయి. అందుకే పిల్లల కోసం మంచి పెట్టుబడి ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈక్విటీల్లో రిస్క్, రివార్డ్ రెండూ ఉంటాయి. కనుక ఈక్విటీల్లో నష్టభయం ఉన్నప్పటికీ, వృద్ధికి కూడా మంచి అవకాశమే ఉంటుంది. అందుకే పిల్లల వయస్సు, లక్ష్య సాధనకు ఉన్న వ్యవధి ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలి. కనీసం 5 ఏళ్లు లేదా పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ ఈ పెట్టుబడులను కొనసాగించాలి. అంతేకాదు, పిల్లల చదువులకు ఉపయోగపడే ఈ పెట్టుబడులను అకారణంగా వెనక్కి తీసుకోకూడదు.
ఏ పథకాన్ని ఎంచుకోవాలి?
మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, బాధ్యతలు, లక్ష్యాలకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవాలి. కచ్చితంగా సర్టిఫైడ్ ఫైనాన్సిషన్ అడ్వైజర్లను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలి. పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా వాటిని క్రమం తప్పకుండా సమీక్షిస్తుండాలి. అవసరమైతే అందుకు తగిన మార్పులు చేర్పులు చేసుకోవాలి. అప్పుడే మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయి.
ఈ కొత్త ఏడాదిలో మీ ఆర్థిక లక్ష్యం నెరవేరాలా? ఈ టాప్-25 టిప్స్ మీ కోసమే!
బీ అలర్ట్- జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్! కచ్చితంగా తెలుసుకోండి!