Vijay mallya news: దేశంలో రూ.9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి పరారీలో ఉన్న 'కింగ్‌ఫిషర్' యజమాని విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కార కేసులో ఈ నెల 11న సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేయనుంది. జస్టిస్ యు.యు.లలిత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ శిక్ష వేయనుంది. జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ పి.ఎస్.నరసింహ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. వాదనలు ముగియడంతో గత మార్చి పదో తేదీన సుప్రీంకోర్టు ఈ తీర్పును రిజర్వులో పెట్టింది. మాల్యా తరఫు న్యాయవాది, అమికస్ క్యూరీ జైదీప్ గుప్తా వాదనలన్నీ విన్న ధర్మాసనం ఇంకా చెప్పాల్సినది ఏమైనా ఉంటే మార్చి 15లోపు రాతపూర్వకంగా సమర్పించాలని అప్పట్లో సూచించింది. గత అయిదేళ్లుగా బ్రిటన్‌లో ఉంటున్న మాల్యా అందుబాటులో లేనందున గుప్తా తన నిస్సహాయతను వ్యక్తం చేశారు.
అబూసలేం పిటిషనుపైనా అదే రోజు..: ముంబయి బాంబు పేలుళ్ల కేసు (1993)లో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూసలేం పిటిషనుపైనా జులై 11న సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరించనుంది. 2002లో ఇతని అప్పగింత సందర్భంగా శిక్ష 25 ఏళ్లు దాటకుండా చూస్తామని పోర్చుగల్‌కు భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీ ఆధారంగా తన జీవితఖైదు శిక్షను సవాలు చేస్తూ అబూసలేం దాఖలు చేసిన పిటిషనుపై జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఎం.సుంద్రేశ్‌ల ధర్మాసనం తీర్పు చెప్పనుంది.
ఇవీ చదవండి: అవిభక్త కవలలకు.. అరుదైన శస్త్రచికిత్స సక్సెస్!
సర్వశ్రేష్ఠుడు సర్వేపల్లి... విద్యావేత్త.. దౌత్యవేత్త.. రాష్ట్రపతి!