Petrol Diesel Price Cut : పెట్రోల్, డీజిల్ ధరలు అతి త్వరలోనే తగ్గనున్నాయి! చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రో ధరల్ని సవరించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో వచ్చిన నష్టాలన్నింటినీ పూడ్చుకుని, సాధారణ స్థితికి చేరుకోవడమే ఇందుకు కారణమని వివరించాయి.
అప్పటి నుంచి మారని ధరలు..
చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.. అంతర్జాతీయ విపణికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను రోజూ సవరిస్తుంటాయి. అయితే.. గతేడాది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ పద్ధతి మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భారీగా పెరిగినా దేశీయ వినియోగదారులకు కాస్త ఊరట కల్పించే లక్ష్యంతో రోజువారీ ధరల సవరణ విధానాన్ని 2022 ఏప్రిల్ 6న నిలిపివేశాయి. ఫలితంగా అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో మార్పులు చేయకపోవడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నష్టాలు చవిచూశాయి. 2022 ఏప్రిల్-సెప్టెంబర్ త్రైమాసికంలో ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌కు కలిపి రూ.21,201.18 కోట్లు నష్టం వచ్చింది.
2023 మార్చిలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం ప్రారంభమైంది. అయినా భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా.. పాత నష్టాలు పూడ్చుకునే ప్రయత్నం చేశాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. ఎట్టకేలకు ఇప్పటికి లాభాల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పెట్రో ధరలు తగ్గే అవకాశం ఉందని తీపి కబురు తెలిపాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు.
"చమురు మార్కెటింగ్ సంస్థలకు ఈసారి మెరుగైన త్రైమాసిక ఫలితాలు వచ్చాయి. మరో త్రైమాసికంలోనూ అదే తరహా లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్‌పై గతంలో వచ్చిన నష్టాలు భర్తీ అయ్యాయి. అందుకే పెట్రో ధరలు తగ్గిస్తాయని భావిస్తున్నాం" అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరించాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య-ఒపెక్‌లోని ఓ దేశం చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించినా.. ఆ ప్రభావం భారత్‌పై ఉండదని ఆయా వర్గాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో సరిపడా చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపాయి. ఈ ఏడాది మొత్తానికి చమురు ఉత్పత్తి సామర్థ్యంలో ఎలాంటి మార్పులు చేయరాదని ఆదివారం ఒపెక్ దేశాలు తీర్మానించాయి. అయితే.. ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియా మాత్రం చమురు ఉత్పత్తిని జులై నుంచి తగ్గించాలని స్వచ్ఛందంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. ధరల పెరుగుదలపై ఆందోళనలు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి.
పెట్రోల్ ధరలు ఇలా..
పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర 96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.