దేశంలోని వృత్తి నిపుణుల్లో అధిక మంది తమ ఉద్యోగం మారాలని భావిస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ప్రతి ఐదుగురు వృత్తి నిపుణులలో నలుగురు వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు లింక్డ్ఇన్ సర్వేలో తేలింది. సరైన వేతనం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీని దృష్టిలో పెట్టుకొని కొత్త జాబ్‌ను వెతుక్కుంటున్నట్లు వెల్లడైంది. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో ఆర్థిక భద్రతకు భరోసా కల్పించే ఉద్యోగం కోసం వృత్తి నిపుణులు ప్రయత్నిస్తున్నారని లింక్డ్ఇన్ సర్వే పేర్కొంది.
"ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత శ్రామిక శక్తి అత్యంత దృఢంగా ఉంది. భారత్‌లోని వృత్తి నిపుణులు తమ నైపుణ్యంపైనే ఆధారపడి ముందుకెళ్తున్నారు. దీర్ఘకాల లక్ష్యాన్ని మనసులో ఉంచుకొని కెరీర్‌ను మలచుకుంటున్నారు. నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టి భవిష్యత్‌కు సిద్ధమవుతున్నారు. 18-24 ఏళ్ల మధ్యలో ఉన్న వృత్తి నిపుణుల్లో 88 శాతం మంది ఉద్యోగం మారాలని అనుకుంటున్నారు. 45-54 ఏళ్ల మధ్య ఉన్న వృత్తి నిపుణుల్లో ఈ రేటు 64 శాతంగా ఉంది."
--నిరాజితా బెనర్జీ, లింక్డ్ఇన్ కెరీర్ నిపుణులు, ఎడిటోరియల్ హెడ్
కరోనా తర్వాత ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నారని లింక్డ్ఇన్ సర్వే తెలిపింది. లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో కొత్త స్కిల్స్ జోడించుకుంటున్న సభ్యుల సంఖ్య 43 శాతం పెరిగిందని పేర్కొంది. 'మరో ఉద్యోగం దొరుకుతుందని సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది విశ్వాసంతో ఉన్నారు. కొత్త ఉద్యోగం విషయంలో 32 శాతం మంది వృత్తి నిపుణులు తమ సామర్థ్యంపైనే నమ్మకంతో ఉన్నారు' అని సర్వే వివరించింది.